NEET UG : నీట్ యూజీ ఫలితాలు గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ర్యాంకులు కూడా వెల్లడయ్యాయి. దీంతో నీట్ యూజీ కౌన్సెలింగ్కు ఎన్టీయే సిద్ధమైంది. ఆగష్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అన్ని కోటాలకు సంబంధించిన కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డీమ్డ్ కాలేజీలు, సెంట్రల్ యూనివర్సిటీలు సహా అన్ని కాలేజీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ విషయాన్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ సహా వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెప్టెంబర్ 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 4 నుంచి 17 వరకు జరుగుతుంది. ఆ వెంటనే సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు లభించిన విద్యార్థులు ఈ నెల 22లోపు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రెండో దశ కౌన్సెలింగ్ ఆగష్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతుంది. మూడో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. మిగిలిపోయిన సీట్లకు సంబంధించిన తుది దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది. ఇలా సీట్లు దక్కిన విద్యార్థులు అక్టోబర్ 10 లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి తొలి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగష్టు 13 నుంచి 22 వరకు జరుగుతుంది.
రాష్ట్ర స్థాయి కాలేజీలకు ఎంపికైన విద్యార్థులు ఆగష్టు 28 లోపు చేరాల్సి ఉంటుంది. రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు, మూడో దశ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు జరుగుతుంది. మిగిలిపోయిన సీట్లకు సంబంధించి తుది దశ కౌన్సెలింగ్ అక్టోబర్ 3 నుంచి 5 వరకు జరుగుతుంది. నిబంధనలకు అనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.