Education Department | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : హనుమకొండ జిల్లా విద్యాశాఖలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. ఇప్పటికే అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడినా లంచాలు తీసుకోవడంలో మాత్రం తగ్గడంలేదు. గుట్టుచప్పుడు కాకుండా బిల్లుల పేరిట భారీగానే వసూల్ చేస్తున్నారు. ఫైల్స్ క్లియర్ చేయడానికి, బిల్లుల మంజూరుకు, బదిలీలు, డిప్యుటేషన్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూల్ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. హనుమకొండలోని డీఈవో కార్యాలయంపై, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా విద్యాశాఖ అవినీతి అధికారుల తీరు మారడంలేదు.
హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరకు డబ్బులు వసూల్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పినా బిల్లులు రాకపోగా మళ్లీ బిల్లులు తయారు చేస్తామని డబ్బులు డిమాండ్ చేయడంపై ఆ అధికారి బండారం బయటకు రావడంతో విద్యాశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది..!
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువు భత్యం 17 వాయిదాలలో ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నవి. ప్రభుత్వ జీవో 120 ప్రకారం 30-10-2024 నుంచి డీఏ 22.75 శాతం నుంచి 26.93 పెంచినట్లు, 1-7-2022 నుంచి నవంబర్ 2024 వరకు ఇవ్వాలని జులై 2022-2024 అక్టోబర్ వరకు 17 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వ జీవో ఉన్నా ఒకేసారి 17 వాయిదాల బిల్లు పంపిస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖలో గతంలో ఉన్న డీఈవో వాసంతి ప్రస్తుత పర్యవేక్షకులుగా ఉన్న అధికారి, ఎయిడెడ్ టీచర్స్‌కు కరువు భత్యాన్ని 17 వాయిదాలు కాకుండా ఒకేసారి 17 వాయిదా డీఏలను ఒకేసారి ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎయిడెడ్ టీచర్లకు చెప్పి 17 వాయిదాల బిల్లును ఒకేసారి తయారు చేసుకురమ్మని చెప్పిన సదరు సూపరింటెండెంట్ ఆ బిల్లుపై సంబంధిత అధికారులు సంతకాలు సంతకాలు చేయడం వలన క్లర్క్, ఏవో, సూపరింటెండెంట్, అప్పటి డీఈవో సంతకాలు చేసి పంపించారు.
ఎంతోమంది డీఈవోలు వచ్చినా ఆమె మాత్రం అక్కడే..
6నెలల క్రితం ఈ బిల్ పాస్ చేసి డీటీవోకు పంపించగా డబ్బులు తీసుకున్నట్లు విషయం తెలిసి ఇతర ప్రభుత్వ టీచర్లు డీటీవోను ప్రశ్నించగా ఆ బిల్లులను వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. బిల్లులు రిటర్న్ చేయకుండా ఆమె దగ్గర పెట్టుకున్నట్లు, రిటర్న్ చేస్తే సంబంధిత అధికారులు మళ్లీ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సిన సూపరింటెండెంట్ పంపించకుండా డబ్బులు తీసుకుని ఒకేసారి 17 బిల్లులు పంపించినట్లు ఆరోపిస్తున్నారు. యూనియన్ల నాయకులు సదరు సూపరింటెండెంట్ శైలజ లాలూచీ పడి పంపించారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
రూ.3 లక్షలు హాంఫట్..
17 వాయిదాల బిల్లులను ఇప్పించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు సుమారు రూ.3 లక్షల మేర ముట్టచెప్పినట్లు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖలో బదిలీపై వెళ్లిన అప్పటి క్లర్క్ జాకీర్ స్సేన్, సూపరింటెండెంట్ శైలజ కనుసన్నల్లోనే జరిగిందని, ఎయిడెడ్ టీచర్ల బిల్లులు తయారు చేసిన ఉర్ధూ మీడియం ఎస్జీటీ టీచర్ ఖురేషీ (గతంలో సర్వీస్ బుక్ ట్యాంపరింగ్ చేశాడు), ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు, అతడు విద్యాశాఖలో పనిచేస్తున్నాడు. ఆమెకు ఎవరైతే పడరో ఆ వ్యక్తి గురించి డీఈవోకు చెడుగా అపవాదు వేస్తుంటుందని, ఎంతోమంది డీఈవోలు వచ్చినా ఆమె మాత్రం అక్కడే సీటును పట్టుకుని కూర్చుంటుందని ఆరోపిస్తున్నారు.
బదిలీపై వెళ్లిన ఏవో సత్యనారాయణ, అప్పటి డీఈవో సంతకాలు చేసి బిల్లులను డీటీవోకు పంపించారు. కొందరు ప్రభుత్వ టీచర్ల అవినీతి అక్రమాలు జరిగాయని ప్రభుత్వ టీచర్లు డీటీవోకు వెళ్లి ప్రశ్నించడంతో బిల్లులను వెనక్కి పంపించారు.
రిటర్న్ బిల్లు చేయకుండా మళ్లీ డబ్బులు డిమాండ్
ప్రభుత్వ టీచర్స్ డీటీవోలో అడగగా ఎయిడెడ్ టీచర్స్‌కు, పెన్షనర్లకు, ప్రభుత్వ టీచర్లకు ఒకే రూల్ ఉంది మీరెందుకు రిటర్న్ చేయరని అడిగారు. డీటీవో నుంచి మార్చిలో రిటర్న్ అయ్యాయి. రిటర్న్ అయిన బిల్లు ఇప్పటివరకు రిటర్న్ చేయకుండా మళ్లీ బిల్లు తయారు చేసుకుని రమ్మని సూపరింటెండెంట్ చెప్పడంపై టీచర్లు మండిపడ్డారు. ఇప్పటికే బిల్లు తయారు చేసి పంపించడానికి డబ్బులు వసూల్ చేసిన సదరు ఉద్యోగిణి మళ్లీ ఇప్పుడు కొత్త బిల్లు తయారు చేస్తానని అందుకోసం మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.
గతంలో సరెండ్ లీవ్ ఎన్‌క్యాష్ డబుల్ క్లెయిమ్ చేసేందుకు ప్రయత్నిస్తే సదరు ఉద్యోగి ఇంక్రిమెంట్లలో కోత విధించిన విషయం తెలిసిందే. వెంటనే సూపరింటెండెంట్ శైలజ, బదిలీపై వెళ్లిన క్లర్క్ జాకీర్స్సేన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని, కలెక్టర్, ఆర్జేడీ, డీఈవో స్పందించి అవినీతికి పాల్పడిన అధికారులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.