Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ టాస్కులు మొదలైనప్పటి నుంచి హౌస్‌లో పరిస్థితులు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే రెండు టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్స్ మధ్య పోటీతో పాటు వ్యక్తిగత విభేదాలు కూడా బయటపడుతున్నాయి. మరోవైపు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో ఈ వారం ఎలిమినేషన్ బరిలో ఉన్న కంటెస్టెంట్స్ ప్రేక్షకులను ఓట్లు వేయాలని కోరుతున్నారు. నరేష్ తొలిసారి నామినేషన్లోకి రావడంతో కెమెరా ముందుకు వచ్చి తనకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరాడు. ఎప్పటిలాగే రోహిత్ తన ‘అగ్నిపరీక్ష’ బ్యాచ్ సభ్యులతో మాట్లాడుతూ దేబ్జానీపై తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. అదే సమయంలో తమ గ్రూప్ మరింత బలంగా ఉండాలని భావించి అపూర్వను కూడా తమతో కలుపుకునే ప్రయత్నం చేశాడు.
మరోవైపు ఝాన్సీ తన దగ్గర ఉన్న కత్తులను మష్రూమ్ రూమ్‌లో దాచుకోవడంతో వివాదం మొదలైంది. వంట పనుల్లో సహాయం చేస్తానని, కానీ మష్రూమ్ రూమ్‌కు వెళ్లనని ఆమె షరతు పెట్టడంతో షాలినితో వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని అపూర్వ మిగతా సభ్యులకు చెప్పడంతో ముకేశ్, త్రిగుణ్ ఆమెతో వాగ్వాదానికి దిగారు. బిగ్ బాస్ మరోసారి కత్తుల టాస్క్‌ను తెరపైకి తీసుకొచ్చారు. రెండు కంటే ఎక్కువ కత్తులు ఎవరి దగ్గర ఉంటే వారికి ఆరో వారంలో ఇమ్యూనిటీ దక్కుతుందని ప్రకటించడంతో కంటెస్టెంట్స్ మరోసారి కత్తుల కోసం పోటీ పడ్డారు. మొదటి వారంలో వచ్చిన కొన్ని పవర్స్‌ను కూడా ఉపయోగించాల్సి ఉంటుందని బిగ్ బాస్ స్పష్టం చేశారు.
ఝాన్సీ దగ్గర ఉన్న కత్తి కోసం పలువురు మహిళా కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో త్రిగుణ్ దగ్గరకు ఒక కత్తి చేరడంతో పలువురు అతడిపైకి వెళ్లారు. అమన్, త్రిగుణ్ మధ్య ఈ క్రమంలో గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అమన్ త్రిగుణ్ మణికట్టును పట్టుకోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. త్రిగుణ్ అతడిని తోసేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రోహిత్ జోక్యం చేసుకుని తన అగ్నిపరీక్ష బ్యాచ్ సభ్యులను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కూడా త్రిగుణ్‌పై రోహిత్ చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో చర్చకు దారితీశాయి. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ‘ఫైర్ అండ్ లావా’ అనే టాస్క్‌ను ఇచ్చారు. రెండు టీమ్స్‌కు వేర్వేరు రంగుల డ్రమ్స్‌ను అందించి, వాటిని నిర్దేశించిన మార్గంలో తీసుకెళ్లి రంధ్రాలు ఉన్న బోర్డులో పెట్టాలని సూచించారు. ప్రత్యర్థి టీమ్ డ్రమ్స్‌ను లాగేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. చివరికి బోర్డులో ఎవరి డ్రమ్స్ ఎక్కువగా ఉంటే ఆ టీమ్ విజేతగా నిలుస్తుందని చెప్పారు.
ఇప్పటికే రథం టాస్క్‌లో గెలిచిన భైరవ రెడ్ టీమ్‌కు బిగ్ బాస్ ప్రత్యేక అవకాశం ఇచ్చారు. ముందుగానే ఆట ప్రారంభించేందుకు అనుమతించారు. సప్తశక్తి టీమ్ మాత్రం ఎలాంటి అదనపు ప్రయోజనం లేకుండా గెలిస్తే ఆ విజయం మరింత ప్రత్యేకంగా ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశారు. ఈ టాస్క్‌లో భైరవ రెడ్ టీమ్ తరఫున వంశీ, రామ్ ప్రసాద్, అమన్, రోహిత్ బరిలోకి దిగారు. సప్తశక్తి బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, సృష్టి గేమ్ ఆడారు. నరేష్, వర్షిణి సంచాలకులుగా వ్యవహరించారు. అయితే రెండు టీమ్స్‌లోనూ ‘అగ్నిపరీక్ష’ బ్యాచ్‌కు చెందిన సభ్యులు ఉండటంతో గ్రూపిజం ఆరోపణలు మొదలయ్యాయి. ఒకే బ్యాచ్‌కు చెందిన షాలిని, చరణ్ తమ టీమ్ చర్చల్లో పెద్దగా పాల్గొనకుండా రోహిత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
టాస్క్ జరుగుతున్న సమయంలోనూ రెండు టీమ్స్ మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. అమన్, త్రిగుణ్ మరోసారి వాగ్వాదానికి దిగగా.. సృష్టికి గాయం కావడంతో ఆమె ఏడ్చింది. చివరికి ఈ టాస్క్‌లో భైరవ రెడ్ టీమ్ విజయం సాధించింది. ఓడిపోయిన సప్తశక్తి టీమ్ నుంచి మరో కత్తిని తీసుకోవాలని భైరవ టీమ్‌కు బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో రామ్ ప్రసాద్, దేబ్జానీ, నరేష్ కత్తులను తీసుకోవద్దని సూచించాడు. ఇప్పటికే ఇతర టీమ్ సభ్యుల కత్తులు తీసుకున్నారని, ఇప్పుడు తమ టీమ్ సభ్యులను కాపాడుకోవడం సరైనది కాదంటూ రోహిత్‌ను ప్రశ్నించాడు. చివరికి సృష్టి కత్తిని తీసుకోవాలని అనుకున్న సమయంలో బిగ్ బాస్ అమన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో అమన్ దేబ్జానీ కత్తిని తీసుకోవడంతో మరోసారి గ్రూపిజంపై చర్చ మొదలైంది.
తమ గ్రూప్ సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని త్రిగుణ్, ముకేశ్ గుర్తించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో చరణ్‌ను నిజాయితీగా ఆట ఆడాలని, అమన్ దగ్గర ఉన్న కత్తిని తీసుకురావాలని సూచించారు. మరోవైపు షాలిని కత్తి కోసం వెతుకుతుండగా వర్షిణితో గొడవ జరిగింది. ఈ సమయంలో రోహిత్ షాలినికి మద్దతు ఇవ్వడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత రోహిత్, షాలిని మధ్యే తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను షాలినికి బహిరంగంగానే మద్దతు ఇస్తున్నానని రోహిత్ చెప్పగా.. తనకు మద్దతు ఇస్తున్నట్టు బయట చూపించుకోవద్దని షాలిని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన టీమ్ కంటే బయట ఉన్నవారికి మద్దతు ఇవ్వడం వల్ల తన టీమ్ ముందు ఇబ్బందిపడ్డానని రోహిత్ చెప్పడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.