న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న యువతపై భద్రతా దళాలు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసి పెల్లెట్ తుపాకులు, బాష్పవాయు ఉపయోగించిన 11 రోజుల తర్వాత జూలై 31 రాత్రి 11:06 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్టకేలకు ఈ ఘటనపై స్పందించారు. ఈ నిరసనలు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగడమే కాకుండా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి. ఈ విషయంపై మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్తారని పలువురు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మహిళా నిరసనకారులు అసభ్య పదజాలం ఉపయోగించడం పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. దారి తప్పిన అటువంటి పిల్లలను క్షమించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మీ తప్పుల వల్ల పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే, మీ పోలీసులు నిరసనకారులపై పెల్లెట్ గన్లు, ఏకే 47, లాఠీలను ప్రయోగిస్తుంటే.. మీరు మాత్రం బాధితుడిలా నటిస్తూ నాటకాలు ఆడుతున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మోదీ నిరసనకారులను క్షమిస్తున్నట్టు ప్రకటించిన తరుణంలోనే, ఆయనను విమర్శించిన మహిళలు, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆయన మద్దతుదారులు భారీస్థాయిలో వేధింపులు, సైబర్ దాడులకు దిగారు.
మోదీపై అసభ్య పదజాలం ఉపయోగించినందుకు ఒక యువతిపై నోయిడా పోలీసులు ఒక రోజు క్రితమే కేసు నమోదు చేశారు. ప్రభుత్వ మద్దతు ఉన్న ప్రధాన స్రవంతి మీడియా కూడా ఆ అమ్మాయిని రాక్షసిలా చిత్రీకరించే పనిలో పడింది. చివరకు ఆ మైనర్ ఒక వీడియోను అప్లోడ్ చేస్తూ.. తనకు 15 ఏండ్లని, తాను ఉపయోగించిన భాషకు క్షమాపణలు చెప్తున్నానని తెలిపింది. ఈ దేశంలో పెద్దవారు రోజువారీగా శిక్ష లేకుండా చేసేపనికి, ఒక 15 ఏండ్ల బాలిక దేశం మొత్తానికి క్షమాపణ చెప్పేలా భయభ్రాంతులకు గురిచేసినందుకు ఈ దేశం తలదించుకోవాలని కేశవ్బేడీ అన్నారు.
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సమయంలో తనను, తన దివంగత తల్లిని దూషించిన యువ నిరసనకారులను క్షమించాలని అనుకుంటున్నానని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో మరో వీడియోను పోస్ట్ చేశారు. ప్రధానిని దూషించినందుకు నోయిడాకు చెందిన ఒక యువతిపై కేసు నమోదు చేసిన మరుసటి రోజున ఈ వీడియో వెలువడింది. ఆ యువతి వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మిత్రులారా, ఈ రోజు నేను కేవలం మీతోనే మాట్లాడాలని అనుకుంటున్నాను.
జంతర్ మంతర్ వద్ద కొందరు అల్లరి యువకులు నన్ను, నా దివంగత తల్లిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశారు. అని ప్రధాని వీడియోలో పేర్కొన్నారు. తన ప్రసంగాన్ని మోదీ కొనసాగిస్తూ అయితే చిన్న వయసులో పొరపాట్లు జరగడం సహజం. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఆ వయసులోనే ఉంటుంది. యువతకు అది సహజమైన లక్షణం. అందుకే, సమాజంలో ఉన్న ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను అని ప్రధాని మోదీ తన వీడియోలో చెప్పారు.