Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద సంభవించింది. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఆగష్టు 7 వరకు కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటం, మరికొన్ని ప్రాంతాల్లో కూడా దీనికి అవకాశం ఉండటంతో రోడ్డు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 102 రోడ్లను అధికారులు మూసివేశారు. మండి ప్రాంతంలో 43 రోడ్లు, కుల్లు ప్రాంతంలో 33 రోడ్లు, షిమ్లా ప్రాంతంలో 11 రోడ్లు, చంబా, కంగ్రా, సిర్మౌర్, ఉనా ప్రాంతాల్లోనూ పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అనేక జిల్లాల్లో తాగునీటి సరఫరాకు, విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సామగ్రి దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ నీటి సరఫరాకు సంబంధించిన 28 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గత నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూలై 1 నుంచి 31 వరకు సగటు వర్షపాతం 255.9కాగా, ఈ నెలలో 275.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలోనూ భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.
ఇప్పటికే ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోడ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.