జైపూర్: ‘చాయ్‌వాలాజ్’ వ్యవస్థాపకుడైన 30 ఏళ్ల రోహిత్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసాలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. (Chaiwalaz Founder Suicide) కుటుంబ సభ్యులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఆయనను కిందకు దించారని, జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు పోలీస్ అధికారి చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు. రోహిత్ శర్మ ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
కాగా, రోహిత్ శర్మ నర్సింగ్ చదువుతున్నప్పుడే, 17వ ఏట జైపూర్‌లో ‘చాయ్‌వాలాజ్’ స్టార్టప్‌ను స్థాపించారు. తద్వారా చిన్నతనంలోనే వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. జైపూర్‌లో మానసరోవర్‌లోని షిప్రా పాత్లో తొలి టీ కేఫ్‌ను ఆయన ఆరంభించారు. ఆ తర్వాత నగరంలో మరో అవుట్‌లెట్‌ను ప్రారంభించి ఆ వ్యాపారాన్ని విస్తరించారు. పలు నగరాల్లో ఏడు ‘చాయ్‌వాలాజ్’ అవుట్లెట్లను రోహిత్ శర్మ ఏర్పాటు చేశారు. దౌసాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నారు.
మరోవైపు ఆరు నెలల కిందట అన్ని ‘చాయ్‌వాలాజ్’ అవుట్లెట్లను రోహిత్ శర్మ మూసివేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు ఆయన మళ్లారు. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రోహిత్ శర్మ తండ్రి హితేంద్ర మోహన్ శర్మ మెడికల్ స్టోర్ నడుపుతున్నారు. రోహిత్ భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. రోహిత్ శర్మ ఆత్మహత్య పట్ల ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.