Trisha | తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త్రిష సినిమా ఎప్పుడొస్తుందన్నా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హీరోయిన్ కెరీర్ ఐదారేండ్లు గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో కథానాయికగా 20 ఏండ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. సినిమాలో కాస్త బరువైన పాత్ర ఉంటే.. త్రిష అయితే బాగా చేస్తుందన్న పేరు తెచ్చుకుంది. అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్లో సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్‌గా నిలుస్తున్న త్రిష గురించి కొన్ని కబుర్లు..
నేను ఎప్పుడూ ‘కమ్‌బ్యాక్’ అనే పదాన్ని ఇష్టపడలేదు. నేను ఒక సినిమా చేయడం, చేయకపోవడం అనేది నా అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కరెన్సీ కోసం సినిమాలు చేయాలనుకోను. అందుకే ఏడాదిపాటు ఖాళీగా ఉండటానికైనా ఒప్పుకొంటాను కానీ, నచ్చని పాత్రను చేయను. పాత్రల ఎంపికలో కొన్నిసార్లు నా నిర్ణయాలు తప్పయినప్పటికీ.. బాధపడను. వాటినుంచి మరిన్ని పాఠాలు నేర్చుకున్నాను.
నా సినీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఇంత సుదీర్ఘంగా సాగుతుందని అనుకోలేదు. 20 ఏండ్లుగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నా.. మంచి పాత్రలనే ఎంచుకుంటున్నా. నటిగా నాకు సంతృప్తినిచ్చే రోల్స్ చేస్తున్నా. పాత్రల ఎంపికలో రిస్క్ చేయాలనుకోవడం లేదు. కథ విన్నప్పుడు పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి ఎంచుకుంటాను. అది హీరోయిన్, నెగెటివ్ రోల్, లేడీ ఓరియెంటెడ్.. ఏదైనా కావచ్చు. నాకు నచ్చితేనే సంతకం చేస్తాను.
నిజాయతీగా చెప్పాలంటే, నాకు సినిమాలు ఎప్పుడూ ఫాంటసీగానే ఉంటాయి. మహిళలకు, యువతకు సందేశం ఇచ్చే సినిమాలు చేయాలని ఉంది. కానీ అన్నిసార్లు అది వీలు కాకపోవచ్చు. ప్రేక్షకులను మెప్పించే ప్రతి సినిమా గొప్పదే అని భావిస్తాను.
మనం మనస్ఫూర్తిగా చేసే పనికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు. కొందరు నా వయసు గురించి బాధపడిపోతున్నారు. ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తారు. నాకోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలు సృష్టిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పించగలిగే పాత్రల్లో నన్ను చూపిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు.
నా మీద కొంతమంది అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిప్పుడు బాధపడ్డాను. అలాగని వారిని వదిలేస్తే.. ఆ మాటలకు అంతం ఉండదని ఎదురు తిరిగాను. ఆ సమయంలో నా కుటుంబంతోపాటు తోటి నటీనటులు నాకు అండగా నిలిచారు. న్యాయం నావైపు ఉండటంతో నేను గెలిచాను. నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నమ్ముతాను. నా సక్సెస్‌కి కారణం అదే!
నా కెరీర్ ప్రారంభంలో విజయ్, అజిత్‌తో సినిమాలు చేశాను. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వాళ్లు చాలా పెద్ద హీరోలు. అయినప్పటికీ మా మధ్య స్నేహం చెక్కు చెదరలేదు.
సామాజిక మాధ్యమాలపై నాకు అంతగా ఆసక్తి ఉండదు. సోషల్ మీడియాలో చాలామంది గాసిప్స్‌తో కాలం గడిపేస్తున్నారు. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో ఇలాంటివి చాలా చూశాను. అందువల్ల నా మీద వచ్చే అసత్య వార్తలు, గాసిప్స్, ట్రోల్స్‌ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశా. నిజం ఏంటో నాకు, నా చుట్టూ ఉన్నవాళ్లకు తెలుసు.