Fingerprint Jewellery | మహిళలు కాలానుగుణంగా తమ ఆహార్యానికి నిండుదనాన్నిచ్చే సంప్రదాయ నగలకు పెద్దపీట వేస్తూనే… ట్రెండ్‌కు తగిన నగలకూ ప్రాధాన్యం ఇస్తూ ఫ్యాషన్ ఫాలో అవుతుంటారు. అందువల్ల రోజురోజుకూ మగువలను మెప్పించే రకరకాల నగలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఈతరాన్ని ఆకట్టుకునేలా చెరగని గుర్తుల్ని ముద్రించుకుని మహిళల మేనిపై ఒదుగుతున్నవే ఫింగర్‌ప్రింట్ జువెలరీ (వేలిముద్రల నగలు). ప్రేమించిన వారి గుర్తుగా తీపి జ్ఞాపకాలను ఒదిగిన ఈ స్పెషల్ జువెలరీ విశేషాలేంటో తెలుసుకుందాం..
మనం ఇష్టపడే వ్యక్తులు, వారు ఇచ్చే బహుమతులు ఎప్పుడూ ప్రత్యేకమే. పుట్టినరోజు, పెండ్లిరోజు, ప్రేమికుల రోజు.. సందర్భం ఏదైనా ఆత్మీయులు ఇచ్చే కానుకల్ని తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటాం. అమ్మమ్మ కాసులపేరు, నాయనమ్మ నానుపట్టి, అమ్మ ఇచ్చిన దుద్దులు, నాన్న కొన్న పట్టీలు.. ఇలా మహిళలు ధరించే ప్రతి ఆభరణానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. దాని వెనుక జ్ఞాపకాలు అల్లుకున్న ఓ అందమైన కథ మెరుస్తుంటుంది. ఆభరణాలు అందాన్నే కాదు మనసుపొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలనూ నింపుకొని మరింత అందంగా మెరిసిపోతాయి. ఇష్టమైన వ్యక్తులు ఇచ్చే నగలే కాదు, వారి వేలిముద్రలనూ అందమైన నగలుగా అలంకరించుకుంటున్నారు ఆధునిక మహిళలు. ఈతరం పడచులు ఆభరణాల ఎంపికలో అందంతోపాటు అన్ని సందర్భాల్లో ధరించేందుకు అనువుగా ఉండే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ట్రెండ్‌కు అనుగుణంగా సన్నటి చైన్లు, వాటికి పెండెంట్లు, ఉంగరాలు, బ్రేస్లెట్లపై వేలిముద్రలను ముద్రించి అందమైన గుర్తులుగా మలుస్తున్నారు తయారీదారులు. చిన్నపిల్లల కాళ్లు, చేతుల అచ్చులు వేయించుకోవడం లేటెస్ట్ టేస్ట్. దీనికి కొనసాగింపుగా తల్లిదండ్రుల ప్రేమకు గుర్తుగా పురుడుపోసుకున్న పిల్లలకు వారి జ్ఞాపకంగా ఈ వేలిముద్రల నగలను అలంకరిస్తున్నారు. తల్లిదండ్రుల వేలిముద్రలను హృదయాకార లాకెట్లపై ముద్రించి చైన్లకు జోడిస్తున్నారు. వేలిముద్రలతోపాటు పేర్లు, నామధేయంలోని మొదటి అక్షరం కూడా ఈ నగల్లో అందంగా అమరిపోతున్నాయి. ప్రత్యేకమైన తేదీలు ఈ వేలిముద్రల పక్కనచేరి అందమైన కీ చైన్లు, నేమ్ప్లేట్లుగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్రేమ గుర్తులనూ నగలుగా మలుచుకోండి!