ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. సాధారణంగా ఎవరైనా ఎందుకైనా ఒకసారి అసత్యం చెప్పినప్పుడు, అది అసత్యమని నలుగురికీ తెలిసిపోతే, అంతటితో జంకు కలిగి సదరు అసత్యాన్ని తిరిగి చెప్పరు. కానీ, రేవంత్‌రెడ్డి అట్లా కాదు. తను ఒక అరుదైన వ్యక్తి. అదే అసత్యాన్ని బేఫికర్‌గా మళ్లీ మళ్లీ ఎన్ని సార్లయినా చెప్పగలరు. అది శక్తిమంతమైన నాయకత్వానికి నిదర్శనమన్నది ఆయన నమ్మకమేమో తెలియదు. కాని ప్రజలట్లా భావిస్తున్నట్టు కన్పించదు. అది తన బలహీనతగానే తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఆరు గ్యారెంటీల అమలు, 30 వేల ఉద్యోగాల భర్తీ విషయాలు. వాటితో పాటు ప్రస్తుతం సవాళ్లకు కేంద్రంగా మారిన రైతు రుణమాఫీ మరొకటి.
వందరోజుల గడువుతో ప్రజలకు బాండ్ పేపర్లపై ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మూడింటిని అమలుచేశామని కొద్దికాలం కిందటి వరకు చెప్పిన ముఖ్యమంత్రి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ సంఖ్యను నాలుగుకు పెంచి, ఇప్పుడు అయిదంటున్నారు. ఇందులోని సత్యాసత్యాలలోకి వెళ్లేముందు చెప్పుకోవలసిన మరొక విషయం 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నది. ఈ రెండు మాటలు కూడా నిజం కాదన్నది పరిశీలకుల లెక్కలలో ఎప్పుడో తేలింది. అదేమిటో కొద్ది సేపట్లో చూద్దాము. అదట్లుంచి గత కొద్దిరోజులుగా మరొక విషయం ముందుకొచ్చింది. అది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రశ్న. కనుక మొదట అందులోకి వెళ్లాలి.
Harish Rao-Revanth Reddy | కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ అయినా చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరాధారంగా ఆరోపించిన రేవంత్‌రెడ్డి, తాము గెలిచినట్టయితే డిసెంబర్ 9వ తేదీనాడే రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేయగలమని, ఆ ఫైలుపైనే తొలి సంతకం చేయగలమని, కనుక రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల కొత్త అప్పు తెచ్చుకోవాలని ప్రకటించటం తెలిసిందే. కానీ 9 గడిచిపోయి, తర్వాత 100 రోజుల గడువు, ఆ తర్వాత మరొక 20 రోజుల కాలం గడిచిపోయినా ఇదేమీ జరగకపోగా, రేవంత్‌రెడ్డి ఈ ప్రశ్నపై ఈరోజు వరకు కూడా అసలే మాట్లాడకపోవటం గమనార్హం. నిజానికి ఇవన్నీ పలుమార్లు చర్చకు వచ్చిన, పదేపదే రాసిన విషయాలే అయినందున ఇప్పుడు తిరిగిరాయటం విసుగెత్తించే విషయమే. కానీ ఈ ప్రశ్న గత రెండు రోజులుగా రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావుల మధ్య తీవ్రమైన సవాళ్లు, ఎదురు సవాళ్లుగా మారినందున రాయకతప్పటం లేదు. పైగా ఈ అంశం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఎంతైనా ఉన్నది.
మొదట జరిగింది ఈ కింది విధంగా ఉన్నది. రుణమాఫీ ఏమైందని రైతులు, ప్రతిపక్షాలు, ఇతరులు ఎంత ప్రశ్నించినా ముఖ్యమంత్రి మౌనాన్నే పాటించారు. తన మంత్రులు, శాసనసభసభ్యులు మాత్రం తలొక తీరున మాట్లాడటం మొదలుపెట్టారు. మాఫీకి తేదీ ఏమీ చెప్పలేదని, 9వ తేదీ అనలేదని, వంద రోజులని కూడా అనలేదని, అసలు మాఫీ మాటే అనలేదని చిత్ర విచిత్రమైన వాదనలు సాగించారు. దీనితో రైతులలో అయోమయం తలెత్తినా ముఖ్యమంత్రి మాత్రం తన మౌనాన్ని కొనసాగించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావటం, ప్రతిపక్షాల విమర్శలు పెరగటం, రైతాంగంలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం కావటంతో అప్పుడిక పెదవి విప్పక తప్పలేదు. రుణమాఫీ విషయం చాలదన్నట్టు రైతుభరోసా రూ.15 వేలకు పెరగకపోవటం, కౌలు రైతులు, రైతు కూలీలకు సహాయంపై ఇచ్చిన హామీ గాని, ధాన్యానికి బోనస్ గాని అమలుకాకపోవటం రైతుల నిరసనలకు తోడయ్యాయి. ఇక నీళ్లు లేక పంటలు ఎండటం, కరెంటు కోతలు, మోటర్లు కాలటం, ధాన్యం కొనుగోలులో మోసాలు అగ్నికి ఆజ్యంలా మారాయి. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఇక ఒత్తిళ్లన్నీ తట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి, రుణమాఫీకి డిసెంబర్ 9 గడువునైతే ఎత్తలేదు కానీ, కొత్త గడువును ప్రకటించారు. అది ఆగస్టు 15. అప్పటికి లోక్‌సభ ఎన్నికలే గాక స్థానిక సంస్థల ఎన్నికల గండం కూడా గడిచిపోగలదన్నది ఆయన అంచనాయేమో తెలియదు.
దానినట్లుంచి రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆగస్టు 15 మాటలు ప్రతిరోజు, తాను వెళ్లిన ప్రతిచోటా, మరిచిపోకుండా అంటున్నారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్ల మీద ప్రమాణాలు కూడా చేస్తున్నారు. అట్లా ఈ నెల 20 నుంచి 24వ తేదీ మధ్య నాలుగు సభలలో ఏడుగురు దేవుళ్ల మీద ఒట్లు పూర్తయ్యాయి. అయినా రైతులు నమ్మకపోవచ్చునని అనుమానంతో కావచ్చు, ‘నన్ను నమ్మండి’ అనే మాటను సైతం నొక్కి మరీ చెప్తున్నారు. దీనంతటి మధ్య గమనించవలసిందేమంటే, డిసెంబర్ 9 నాడు ఎందుకు మాఫీ చేయలేదు? కనీసం తర్వాత రోజుల్లోనైనా? అనే వివరణ మాత్రం ఇవ్వటం లేదు. తన ఉద్దేశ్యంలో నిజాయితీ ఉంటే, మాఫీ చేయాలనుకున్నా ఆర్థిక పరిస్థితి సహకరించలేదని, అందుకు చింతిస్తున్నానని రైతులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని, త్వరలోనే ఆ పని తప్పక చేస్తామని చెప్పవచ్చు. కానీ ఆ పనిచేయటం లేదంటే ఆయన మనసు సాఫీగా లేదన్నమాట. కేవలం ఓట్లు సంపాదించే ఉద్దేశ్యంతో డిసెంబర్ 9 గడువు సాధ్యం కాదని తెలిసి కూడా, గంభీరమైన, దృఢమైన స్వరంతో ఆ హామీని ఎలుగెత్తి ఇచ్చారన్నమాట. ఇప్పుడు రైతు వ్యతిరేకత పెరుగుతుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఆ ఉక్కిరిబిక్కిరిని హరీశ్‌రావు మరింత పెంచారు. ఈ రెండవ గడువు అయిన ఆగస్టు 15లోగా మాఫీ చేయనట్టయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగలరా అని సవాలు చేశారు. ఆగస్టు 15 ఇప్పటినుంచి ఇంకా మూడు నెలల మూడు వారాల దూరంలో ఉంది. డిసెంబర్ 9 నుంచి లెక్క వేస్తే మొత్తం ఎనిమిది నెలల ఒక వారం. పంట బోనస్ కూడా ఇదే పద్ధతిలో ఇంతేకాలం వాయిదా వేస్తున్నారు. ఇక రైతు భరోసా, కౌలు రైతు భరోసా, రైతు కూలీల సహాయం గురించి అయితే ఇప్పటివరకింకా ఉలుకు, పలుకు లేదు. వాటినట్లుంచి చూసినా, రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చేసి తీరగలమని చెప్తారా? వంద రోజుల గడువు గల ఆరు గ్యారెంటీలలోని 13 హామీలను అప్పటికైనా అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయగలరా? అన్నది హరీశ్ ప్రశ్న. అందుకు జవాబుగా ముఖ్యమంత్రి, ఒకవేళ రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. 6 గ్యారెంటీల మాట మాత్రం ఆయన ఎత్తలేదు. ఇదొక విచిత్రం. రుణమాఫీ కాంగ్రెస్ హామీ. దానిని అమలుచేయవలసిన బాధ్యత వారిది. తమ బాధ్యత ప్రకారం తమ హామీని అమలు జరిపితే ఇతరులు వారి పార్టీలను రద్దు చేసుకోవాలనటం ఒక విచిత్రమైన తర్కం. ఒకవేళ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రద్దుచేస్తారా?
ముఖ్యమంత్రి సవాలుకు హరీశ్ ప్రతి సవాలు ఇప్పటికే ముందుకొచ్చింది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీతో పాటు, వందరోజుల గడువు గల ఆరు గ్యారెంటీలలోని 13 హామీలన్నింటిని అమలుపరిచే పక్షంలో తాను అసెంబ్లీకి రాజీనామా చేయటమే గాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా ఉప ఎన్నికలకు సైతం తిరిగి పోటీ చేయబోనని ప్రకటించారు. అమలు జరపటంలో విఫలమైతే రేవంత్‌రెడ్డి సీఎం పదవిని వదులుకోవాలన్నారు. ఇది ఏ విధంగా చూసినా సమంజసమైన ప్రతిపాదన. ప్రభుత్వానికి స్వయంగా తామే ఇచ్చిన హామీల అమలుకు 100 రోజులకు బదులు సుమారు 250 రోజుల సమయం లభిస్తుంది. అది 150 శాతం ఎక్కువ. ఇది చాలా మంచి అవకాశం గనుక ఇందుకు ముఖ్యమంత్రి నిస్సంకోచంగా అంగీకరించవచ్చు. ఆ పని చేసి అమలు కూడా చేసినట్లయితే తన ప్రతిష్ట గణనీయంగా పెరుగుతుంది. హామీలను 100 రోజులలో అమలుపరచని అప్రతిష్ట కొట్టుకుపోతుంది. తర్వాత నాలుగున్నరేండ్ల పాటు తమకు అసెంబ్లీలో హరీశ్‌రావు ‘తల నొప్పి’ ఉండదు. ఇందులో మరొక విచిత్రం ఏమంటే రుణమాఫీ అమలు చేస్తే హరీశ్ రాజీనామా చేయాలంటున్నారు గానీ, అమలు చేయలేకపోతే తను రాజీనామా చేస్తానని మాత్రం ప్రకటించటం లేదు.
రేవంత్‌రెడ్డి బేఫికర్ అసత్యాలకు మరొక ఉదాహరణ, తామిప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామనటం. ఇది ఎంతమాత్రం నిజం కాదని, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని సాక్షాత్తూ నిరుద్యోగులే పలుమార్లు స్పష్టం చేసిన తర్వాత కూడా ఆయన ఆ ఉద్యోగాలు తమవని మళ్లీ మళ్లీ చెప్పటాన్ని చూసి ఏమనాలో తోచటం లేదు. బహుశా ఎవరికీ తోచదు. ఆరు గ్యారెంటీల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఆ గ్యారెంటీ కార్డును ప్రస్తుత వివాద సందర్భంగా పరిశీలించగా, అందులోని ఆరింటిలో ఏ అయిదింటిని అమలుపరిచామని రేవంత్‌రెడ్డి చెప్తున్నారో తెలియకుండా ఉంది.
ఆరింటిలోని 13 హామీలలో అమలుకు తెచ్చినవి ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ విలువ పెంపు అనే నాలుగు మాత్రమే. వీటిలో రెండవది, మూడవది ఆరంభించారు గాని పూర్తికాలేదు. చివరిది కేసీఆర్ అధికారంలో ఉండగానే అమలుకు వచ్చింది. ఇల్లు లేని వారికి రూ. 5 లక్షలన్నది 5వ హామీ అనుకుంటే అది ఎక్కడో నామకార్థంగా మాత్రమే మొదలైంది. అయినప్పటికీ మొత్తం అయిదు అనుకుంటే, 13 హామీలలో తక్కిన ఎనిమిదింటికి ఇంతవరకు ఆరంభమైనా జరగలేదు. అయినా రేవంత్‌రెడ్డి చతురమైన రీతిలో లెక్కలు గడుతూ, 6 గ్యారంటీలలో గల 13 ఉప హామీలలోని 5కు మాత్రం ఆరంభం చేసి, వాటిని మొత్తం 6 గ్యారెంటీలలో 5గా లెక్క చెప్తున్నారు.
ప్రజలతో ఈ చాతుర్యాలు ఒక ముఖ్యమంత్రికి తగినవేనా? ఆయన ప్రజలతో నిజాయతీగా ఉండదలిస్తే, ఆ 5 ఏమిటో, 6 గ్యారెంటీలలోని 13 హామీలేమిటో, వాటిలో దేని పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కొక్కటిగా లెక్క చెప్పాలి. అట్లా చేయటం లేదు గనుకనే తనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావటం అట్లుంచి, అంతకన్న ముఖ్యంగా ప్రజలకు విశ్వాసం లేకుండా పోతున్నది. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను ఇతర విమర్శకులను తోసిపుచ్చవచ్చు. కాని ప్రజలను తోసిపుచ్చలేరు గదా?
ఇప్పుడు ఆగస్టు 15 కొత్తగా గడువు మాట చూద్దాం. ముఖ్యమంత్రి అప్పటికి రుణమాఫీ చేసి తీరగలమని దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారు. తెలంగాణలో ఈ ప్రమాణాల సంస్కృతి ఒకటి రాజకీయాల్లోకి గమ్మత్తుగా ప్రవేశించింది. దీనిని బీజేపీ, కాంగ్రెస్‌లు తమ నిజాయితీ లేనితనానికి నిదర్శనంగా తీసుకువస్తున్నాయి. అదట్లుంచి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీకి మొత్తం రూ.39 వేల కోట్లు అవసరమన్నది ఒక అంచనా. అది చేయటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. గమనించవలసింది ఒకటున్నది. వంద రోజుల గడువు గల 6 గ్యారెంటీలలోని 13 హామీలలో ఉన్న వాటి అమలుగురించి ఆయన ఇప్పటికీ ఏమనటం లేదు. వాటి మాటేమిటని ప్రజలు, ప్రతిపక్షాలు, ఇతరులు సూటిగా ప్రశ్నించినా స్పందించటం లేదు. వాటిలో మహిళలకు ప్రతినెల రూ.2500, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12,000, ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, పింఛన్లను రూ.4,000కు పెంచటం అనేవి ఉన్నాయి. ఇవిగాక నిరుద్యోగ భృతి నెలకు రూ.4,000, ఆటో కార్మికులకు రూ.12,000 చొప్పున సహాయం, ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం అనేవీ ఉన్నాయి. ఇవన్నీ భారీ మొత్తంలో ఖర్చుతో కూడుకున్నవి. వీటికి కాగల ఖర్చెంతో కూడా ప్రభుత్వం వద్ద అంచనాలు ఉన్నట్టు కనిపించదు. అంచనా వేసేందుకే వారు భయపడుతున్నట్టున్నారు. ఇటువంటి స్థితిలో, ఆగస్టు 15ను గడువు రోజుగా తీసుకుంటే, రేవంత్‌రెడ్డికి, హరీశ్‌రావుకు మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు ఏ విధంగా ముగియవచ్చునన్నది ఆసక్తికరంగా మారుతున్నది.
– టంకశాల అశోక్