శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 21:59:04

ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదే: అసదుద్దీన్‌ ఓవైసీ

ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదే: అసదుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌: ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. ఆయన ఇవాళ దారుస్సలాంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో ఇంతటి విధ్వంసం జరిగినా.. ప్రధాని నరేంద్రమోది ఎందుకు నోరు మెదపట్లేదని ఆయన నిలదీశారు. పనికిమాలిన చట్టాలు తెచ్చి, ప్రజల మధ్య మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. గతంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నుంచి మోది పాఠాలు నేర్చుకొని ఉంటారని అనుకున్నాననీ.. కానీ, ఆయనలో ఇసుమంతైనా మార్పు రాలేదని తెలుస్తుందన్నారు.

2020లో ఢిల్లీ మరో మారణహోమానికి వేదికైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేశ పూరిత ఉపన్యాసాలు చేస్తున్నానని కేసులు పెట్టినా భయపడనని ఆయన అన్నారు. ఎందుకంటే, నేను మాట్లాడే ప్రతి మాట దేశానికి మంచి చేస్తుందనే ఉద్ధేశ్యంతోనే అని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు నా గళం వినిపిస్తానని ఆయన తెలిపారు. ఢిల్లీ బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులమంతా.. ఒక నెల జీతం విరాళంగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో ఎన్‌ఆర్‌పీని అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.


logo