Mayank Yadav | లక్నో: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బుల్లెట్‌లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం ధృవీకరించాడు. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లాడి ఏడు వికెట్లు ఖాతాలో వేసుకున్న మయాంక్ ప్రస్తుతం కడుపులో గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముందని వివరించాడు. తొలుత గుజరాత్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ ఈ స్పీడ్‌స్టర్ నాలుగు వారాల విశ్రాంతి తర్వాత ముంబైతో మ్యాచ్ ఆడాడు. కానీ గాయం ఇబ్బంది పెట్టడంతో తన ఓవర్ల కోటా పూర్తి కాకుండానే వెనుదిరిగాడు. బీసీసీఐ పేస్ బౌలింగ్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకున్న మయాంక్ ఎన్సీఏలో పునరావాసం పొందనున్నాడు.