తెలంగాణ భారతదేశంలోనే ఉన్నది. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు మాత్రమే అవుతోంది. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రమే అయినా దేశ ఆర్థికవ్యవస్థలో కీలకంగా ఉన్నది తెలంగాణ. దేశంలో సంపదను సృష్టిస్తున్న అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అయితే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడంలోనే సంతృప్తి, సంతోషం ఉంటాయి. కానీ, ఆ విషయంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. జరుగుతున్నదని అనడం కంటే ప్రధాని మోదీ పనిగట్టుకొని మరీ అన్యాయం చేస్తున్నారంటే బాగుంటుంది. నిలువెల్లా స్వార్థం, పక్షపాత ధోరణిని నింపుకొన్నారాయన.
PM Modi | ఎన్నికల ప్రచారం కోసం వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే మోదీ.. ఎందుకు తెలంగాణపై వివక్ష చూపుతున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా.. తెలంగాణ చేసిన తప్పేంటి? ఎందుకు మాకు రావాల్సిన ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లిపోతున్నాయి? ఎందుకు మాకు రావాల్సిన నిధులు అహ్మదాబాద్‌కు తరలిపోతున్నాయి? ఒక్క తెలంగాణకే కాదు.. దక్షిణాది రాష్ర్టాలకు రావాల్సిన నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నారు? నిస్వార్థంగా పనిచేస్తానని ప్రమాణం చేసి పదవిలో కూర్చున్న మోదీ.. ఎంత స్వార్థపూరితంగా పనిచేస్తున్నారో కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం.
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 2022లో రెండోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.60 వేల కోట్ల నిధుల వరద పారించింది. పాత లెక్కలను ఒకసారి పరిశీలిస్తే.. 2017-21 వరకు కేవలం నాలుగేండ్లలో గుజరాత్‌కు రూ.6 లక్షల కోట్ల కేంద్ర పెట్టుబడులు వెళ్లాయి. ఇది జాతీయ పెట్టుబడుల సగటులో 25.8 శాతం. వందలో రూ.25 గుజరాత్‌కే తీసుకుపోతే మిగతా 28 రాష్ర్టాల పరిస్థితి ఏమిటి? అభివృద్ధి అంటే సమగ్రంగా, సమ్మిళితంగా ఉండాలి. అప్పుడే అన్ని రాష్ర్టాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. పేదరికం దూరమవుతుంది. కానీ, నిధులన్నీ గుజరాత్‌కే ఇవ్వాలి, కాంట్రాక్టులన్నీ తన ఇద్దరు గుజరాతీ మిత్రులకే ఇవ్వాలనేది నరేంద్ర మోదీ విధానం అని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.
నోటికాడి బుక్కను లాక్కుంటున్న మోదీ: గుజరాత్ కోసం ఇతర రాష్ర్టాల నోటికాడి బుక్కను లాగేసుకుంటున్నారు మోదీ. ఇతర రాష్ర్టాల నుంచి ప్రతిపాదనలు వచ్చి, అక్కడే పెట్టాలని నిర్ణయించిన ప్రాజెక్టులను సైతం గుజరాత్‌కు మళ్లించుకుంటున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్)ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని మొదట నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత దీన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. 2022 ఏప్రిల్ 19న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. మనదగ్గరే ఏర్పాటై ఉంటే రూ.2 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవి. దేశంలోనే మొదటి రైల్వే లోకోమోటివ్ తయారీ యూనిట్ లెక్క ప్రకారమైతే మన రాష్ట్రంలోని కాజీపేటలో ఏర్పాటవ్వాలి. ఏపీ విభజన చట్టంలోనూ ఈ హామీ ఉన్నది. కానీ, మోదీ తన గుజరాత్ కోసం మన కోచ్ ఫ్యాక్టరీని లాక్కెళ్లిపోయారు. గుజరాత్‌లోని దాహోద్‌లో ఏర్పాటు చేసుకున్నారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్) కేసీఆర్ చొరవతో హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఇది చూసి మోదీకి కన్నుకుట్టింది. ఆ వెంటనే దీనికి పోటీగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో మారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరుతో మరో దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2022-23 బడ్జెట్లో దానికి నిధులు కూడా కేటాయించారు.
దేశంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్‌ను పుణెలోని తళేగావ్లో పెట్టాలని మొదట నిర్ణయించారు. కానీ, దీన్ని గుజరాత్‌లోని డొలేరాకు పట్టుకుపోయారు. ప్లాంట్ ఏర్పాటు కోసం అనుకూల ప్రాంతాలపై సర్వే చేసిన నిపుణులు డొలేరా కంటే తళేగావ్ అయితేనే బాగుంటుందని చెప్పినా.. దాన్ని మోదీ సర్కారు బుట్టదాఖలు చేసింది. తళేగావ్లోనే ఏర్పాటుచేసి ఉంటే మహారాష్ట్రకు రూ.1,54,000 కోట్ల పెట్టుబడులు వచ్చేవి.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా.. గుజరాత్‌పై మోదీకి ఉన్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేయక తప్పలేదు. రూ.22 వేల కోట్ల వ్యయంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పెట్టాల్సిన విమాన తయారీ కేంద్రాన్ని గుజరాత్‌లోని వడోదరకు షిఫ్ట్ చేశారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాన్ని తన సొంత రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకున్నారు.
అన్నీ గుజరాత్‌కే…: దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును నరేంద్రమోదీ సర్కారు 2017లో ప్రకటించింది. దీని ప్రారంభ స్థానం అహ్మదాబాద్. ఈ బుల్లెట్ రైలు ఎక్కువ దూరం ప్రయాణించేది కూడా గుజరాత్‌లోనే. ఈ ప్రాజెక్టు దూరం మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. ఇందులో 348 కిలోమీటర్ల విస్తీర్ణం గుజరాత్‌లోనే ఉంది. ఇదీ మోదీ దేశభక్తికి, దేశం మీద, దేశంలోని ఇతర రాష్ర్టాల మీద ఉన్న ప్రేమకు మరో మచ్చుతునక. ఆయన పక్షపాత ధోరణి ఇక్కడితో ముగిసిపోలేదు. దేశంలోనే మొట్టమొదటి బల్క్ డ్రగ్ పార్క్‌ను తన రాష్ర్టానికే పట్టుకుపోయారు. దేశంలోని మొదటి మెడికల్ డివైజ్ పార్క్‌ను గాంధీనగర్లోనే పెట్టుకున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటగా ఎయిర్‌పోర్టు స్థాయిలో ఓ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయగా.. అది కూడా గుజరాత్‌కు చెందినదే. అంతరిక్షంపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో భారీ టెలిస్కోపు ఏర్పాటుచేయాలని నిర్ణయిస్తే.. దాన్ని కూడా మోదీ సొంత ఊరైన వాద్నగర్ దగ్గరలో నిర్మించుకున్నారు.
దేశంలో మొట్టమొదటి రైల్వే నేషనల్ యూనివర్సిటీ దాదాపు రూ.865 కోట్లతో గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేశారు. హై స్పీడ్ రైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఎస్ఆర్టీఐ) కూడా ఇదే క్యాంపస్‌లో పెట్టారు. చివరికి గుజరాత్‌లోని మొతేరాలో అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించి దానికి ఏకంగా తన పేరునే పెట్టుకున్నారు. 2023 ఐసీసీ వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. వరల్డ్‌కప్ ప్రారంభ మ్యాచ్, అత్యంత కీలకమైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్, అలాగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే స్డేడియంలో నిర్వహించి.. మరోసారి తన స్వార్థబుద్ధిని బయటపెట్టుకున్నారు. 2022, 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా గుజరాత్‌లోనే నిర్వహించారు. చివరికి.. అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్ దేశానికి వస్తే.. మురికివాడలకు అడ్డుగా గోడలు, పరదాలు కట్టి మరీ గుజరాత్ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన్ను అక్కడికి తీసుకుపోయారు.
ఇతర రాష్ర్టాలపై మోదీ వివక్ష ఎలా ఉంటుందనే దానికి మరో ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు.. ఎక్కడికి వెళ్లినా ఊర్ల పేర్లు మారుస్తామని చెప్తుంటారు. ఇస్లాం మతస్థుల పేర్లతో ఉన్నాయని ఢిల్లీలో కొన్ని వీధుల పేర్లు మార్చారు. యూపీలోని కీలక పట్టణమైన అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చారు. అటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పేరును మార్చారు. కానీ, గుజరాత్ రాజధాని పేరు అహ్మదాబాద్. ఇప్పటికీ దాని పేరు అలాగే ఉన్నది. అలాగే అదే అహ్మదాబాద్ దగ్గరలో గిఫ్ట్ సిటీ పేరుతో ఓ పట్టణాన్ని నిర్మించారు. ఇతర రాష్ర్టాల్లో మాత్రం పేర్లు మార్చేస్తారు. గుజరాత్లో మాత్రం అన్నీ యథావిధిగా ఉంటాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే.. మోదీ స్వార్థ రాజకీయాలకు బలైన రాష్ర్టాలు, రూటు మార్చుకుని గుజరాత్ గూటికి చేరిన నిధుల కహానీలు కోకొల్లలు. స్వరాష్ట్రంపై ప్రేమ తప్పు కాదు. కానీ, ఇతర రాష్ర్టాల కడుపుకొట్టి ఒక్క రాష్ర్టానికి దోచిపెట్టడమే క్షమించరాని నేరం. నరేంద్ర మోదీ, ఆయన సహచరుడు అమిత్ షా అదే నేరం పదే పదే చేస్తున్నారు. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అన్న నినాదాన్ని.. ‘గుజరాత్ కా సాత్.. గుజరాత్ కా వికాస్’ అన్నట్టుగా మార్చేశారు. నిధులు, పెట్టుబడులు.. ఏవైనా సరే తమ సొంత రాష్ర్టానికి తరలించుకుపోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో దేశ ప్రజలు వీరిని ఇంటికి పంపడం పక్కా. అప్పుడు సొంత రాష్ట్రంలో తప్ప మరోచోట తల దాచుకోలేరు. అందుకే ఇప్పుడే అన్నీ అక్కడికి తరలిస్తే రేపటి రోజున అక్కడైనా తమకు నాలుగు నూకలు దొరుకుతాయనే స్వార్థం వాళ్లది. దానికోసం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపైనా కక్ష సాధిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న తమ రాష్ర్టాల హక్కులను సైతం కాలరాస్తున్నారు. కాబట్టి యువత, ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలి.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ)
-వై.సతీష్ రెడ్డి
96414 66666