ముస్తాబాద్/గంభీరావుపేట, మార్చి 11 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా యూనిట్‌గా ఉన్న యాప్ నమోదును ఇటీవలే రెండు మండలాలకు యూనిట్‌గా తీసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని రైతులు యాప్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో గంభీరావుపేటలోని కొందరు రైతులు ముస్తాబాద్ మండలం గూడెంలోని సొసైటీకి 450 బస్తాలు వచ్చాయని తెలుసుకుని అక్కడ బుక్ చేసుకుని తీసుకొచ్చుకునేందుకు వెళ్లారు.
యూరియా బస్తాలు తీసుకుంటుండగా, అక్కడ ఉన్న గూడెం రైతులు ‘మీది ఏ ఊరు’ అని అడుగగా, గంభీరావుపేట మండలం అని చెప్పి, యూరియా బుక్ చేసుకుని, ఇక్కడికి వచ్చామని చెప్పారు. దీంతో గూడెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి, తమకే యూరియా దొరకడం లేదని, పక్క మండలం రైతులకు ఎలా ఇస్తారని గొడవకు దిగారు. యూరియా బస్తాలపై పెట్రోలు పోశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు చేరుకుని రైతులను శాంతింపజేశారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి యూరియా ఇవ్వవచ్చని పోలీసులు సర్ది చెప్పి పంపించడం గమనార్హం.