Ayurvedic Ice Cream | ఎండలు మండే వేళ చల్లని ఐస్‌క్రీమ్ మనసుకు హాయినిస్తుంది. అయితే, రకరకాల ఫ్లేవర్లు రుచిని అందిస్తాయేమో గానీ, ఆరోగ్యాన్ని కాదు! ఎడాపెడా ఐస్‌క్రీమ్‌లు తినేస్తే బరువు అదుపు తప్పుతుంది. అజీర్ణం అంటుకుంటుంది. ఐస్‌క్రీమ్‌లలో వాడే ప్రిజర్వేటివ్స్ కారణంగా ఈ సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు ఐస్‌క్రీమ్‌లు తినడం అంత మంచిది కాదని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ, ఈ వేసవిలో మీరు ఐస్‌క్రీమ్స్ లగాయించి లాగించొచ్చు.
ఎలాంటి రసాయనాలు లేకుండా, ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారుచేసిన ఆయుర్వేదిక్ ఐస్‌క్రీమ్ తనను టేస్ట్ చేయమంటూ చల్లగా ఆహ్వానిస్తున్నది. కానీ, దాన్ని టేస్ట్ చేయాలంటే అమెరికాలోని న్యూయార్క్ వరకూ వెళ్లాల్సిందే! అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో ఈ ఆయుర్వేదిక్ ఐస్‌క్రీమ్ అందుబాటులో ఉంది. హ్యాండ్‌మేడ్ స్పెషల్ ఐస్‌క్రీమ్ పసుపు వన్నెలో చవులూరిస్తుంటుంది.
రకరకాల ఆయుర్వేద మూలికలతో దీనిని తీర్చిదిద్దారు. పలురకాల ఫ్లేవర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ఐస్‌క్రీమ్ పుట్టి నాలుగైదేండ్లు గడుస్తున్నా.. మళ్లీ వేసవి రావడంతో దీని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ హెల్దీ ఐస్‌క్రీమ్ మనదగ్గరికీ రావాలని కోరుకుందాం. అప్పటిదాకా.. మన జంధ్యాలవారి పీనాసి లక్ష్మీపతిని ఆదర్శంగా తీసుకొని, ఆ ఐస్‌ఫ్రూట్ చిత్తరువు వంక తీక్షణంగా చూస్తూ సాదాసీదా పుైల్లెస్ చప్పరించడమే మనం చేయగలిగింది!