Ustaad Bhagat Singh | తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. సినిమా టాక్ ఎలా ఉన్నా ఆయన సినిమాలకు మొదటి రోజు భారీ కలెక్షన్లు రావడం సాధారణంగా కనిపించే విషయం. వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా కూడా పవన్ సినిమా వస్తే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉండేది. అయితే ఇటీవల పరిస్థితి కొంత మారిందా? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో మొదలైంది. పలు వాయిదాల తర్వాత విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. టైర్-1 హీరో సినిమాలకు వచ్చే స్థాయి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
తర్వాత దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఫుల్ రన్లో మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. పవన్ కళ్యాణ్‌ను భారీ ఎలివేషన్స్‌తో చూపించినా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హరీశ్ శంకర్. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండాల్సింది. కానీ ప్రస్తుతం అభిమానుల్లో కూడా అదే స్థాయి క్రేజ్ కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై మొదట నుంచి ‘తేరీ’ రీమేక్ అనే టాక్ వినిపించింది. విడుదలైన గ్లింప్స్, టీజర్, తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు తగ్గాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీలీల, రాశి ఖన్నా కూడా ఇటీవల వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నారు. ‘భగవంత్ కేసరి’ తర్వాత శ్రీలీలకు పెద్ద హిట్ రాకపోవడం, రాశి ఖన్నా కూడా సరైన విజయాన్ని అందుకోకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఇటీవల రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన’ సినిమా రీ-రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఆ సినిమాకు కూడా హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. కాని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించినంతగా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని సెంటర్లలో బుకింగ్స్ ఓపెన్ కాలేదని సమాచారం. అయినప్పటికీ ప్రీమియర్ షోల టికెట్లు గంటల తరబడి అందుబాటులో ఉండడం అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ దృష్ట్యా సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.