Social Media | రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేస్తే ఓ పనైపోతదని సీపీఐ నేత నారాయణ కేంద్రానికి సలహా ఇచ్చారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఇద్దరు సీఎంలను జైల్లో పెట్టిన కేంద్రం, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేస్తే ముగ్గురు సీఎంలను జైల్లో పెట్టినట్టు అవుతుందని ఆయన సూచించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఐ నేత నారాయణ ఈ విధంగా మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే, అంతా సోషల్ మీడియా మాయ. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో కాస్త వ్యంగ్యాన్ని జోడించి చేసిన వ్యాఖ్యలను ముందు వెనుకా కట్‌చేసి రేవంత్‌రెడ్డి అరెస్టుకు సీపీఐ నారాయణ డిమాండ్ చేసినట్టుగా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. శృతిమించుతున్న సోషల్ మీడియా వైఖరి వల్ల భవిష్యత్‌లో సోషల్ మీడియా ఉంది జాగ్రత్త అని చట్టబద్ధమైన హెచ్చరిక చేసే రోజులు వచ్చినా ఆశ్యర్యం లేదు.
డివోషనల్ టూరిజమ్
సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పర్యటన వల్ల కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయన్నది దేవుడికే తెలియాలి, కానీ ఏ దేవుడు ఎక్కడ ఉన్నది జనాలకు తెలియజేసేవిధంగా పరోక్షంగా డివోషనల్ టూరిజమ్ డెవలప్మెంట్కు ఆయన కృషిచేస్తున్నారని గాంధీభవన్‌లో ఓ సీనియర్ నాయకుడు కొత్త విషయం చెప్పారు. ఎన్నికల ప్రచార సభలకు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్తే, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దేవుళ్లపై ఒట్టేసి ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ సీట్ల మాటేమో కానీ, డివోషనల్ టూరిజమ్ మాత్రం బాగా డెవలపయ్యే అవకాశం లేకపోలేదని సదరు నాయకుడు చెప్పుకొచ్చారు.
హమ్ కిసీ సే కమ్ నహీ!
ఏ మాటకామాట చెప్పుకోవాలంటే… కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్టయిలే వేరు. ఆయన గెలిచినా, ఓడినా షాన్ మే ఫరక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరికే పీసీసీ ఖరారు చేసింది. మంత్రులు కూడా తమను ఇంచార్జీలుగా నియమించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. కానీ, జగ్గారెడ్డి అలా కాకుండా, తనకు తానే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పేరిట లెటర్‌హెడ్ ముద్రించుకొని ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్రకటించుకున్నారు. సొంతంగా ప్రచార రథం, సొంత ఖర్చుతో అభ్యర్థి లేకుండానే పార్టీ తరఫున రోడ్ షో, కార్నర్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కార్యక్రమాలను ఈ నెల 11 వరకు ఆయనే ప్రకటించుకున్నారు. ఇది చూసినవాళ్లు జగ్గన్నా… మజాకా అంటున్నారు.
అందరూ మంత్రులే
రాష్ట్రంలో బీజేపీ తరపున పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా తనను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతానని ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో ఏపీ, తెలంగాణకు కలిపి కిషన్‌రెడ్డి ఒక్కరికే కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. అలాంటిది ఈసారి ఎంతమందికి ఇస్తారని మీడియా వాళ్లు అడిగితే మాత్రం సమాధానం లేదు. ఏమో అవన్నీ తమకు తెలియదనీ.. గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని అంటున్నారు. ఇప్పటివరకు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, మాధవీలత, రఘునందన్‌రావు మంత్రి పదవుల రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు తప్ప వట్టి ఎంపీలు ఎవరుండరన్న మాట!
– వెల్జాల