హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న అమంగల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ (Gurramguda Forest) ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. మొత్తం 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ G.O.Ms.No.7 (తేదీ: 09-03-2026) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చట్టపరమైన ప్రక్రియ పూర్తై, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సీ. సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం ద్వారా అటవీ భూములకు చట్టపరమైన రక్షణ లభించనుందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సీ. సువర్ణ అన్నారు. ఈ అటవీ విస్తీర్ణంలో భాగమైన సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉన్నాయని, “సాహెబ్‌నగర్ కలాన్ కేసు”గా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం వివిధ న్యాయస్థానాల్లో విచారణకు రాగా అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతువలన చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందన ఆమె వెల్లడించారు. తద్వారా అటవీ భూములను ఆక్రమణలు, అనధికార హక్కుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిందని సువర్ణ తెలిపారు. ఈ తీర్పుతో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు మరింత బలపడ్డాయని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి సువర్ణ తెలిపారు. హైదరాబాద్ నగరంలో నగరీకరణ నేపథ్యంలో ఈ పార్క్ నగర ప్రజలకు ముఖ్యమైన గ్రీన్ స్పేస్‌గా మారనుందని ఆమె చెప్పారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు అనువైన ప్రదేశంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు ఆమె తెలిపారు.
అదే సమయంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, గ్రీన్ లంగ్ స్పేస్‌లను విస్తరించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని సువర్ణ పేర్కొన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం కూడా ఆ దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా ఆమె పేర్కొన్నారు.