న్యూఢిల్లీ, జూలై 28 : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మెటా(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఎక్స్(పూర్వ ట్విట్టర్) గూగుల్/యూట్యూబ్‌లపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం, అందులో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతికి తనను, తన కుటుంబ సభ్యులకు అంటగడుతూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అవమానకర పోస్టులు, కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, ఇతర తప్పుడు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం(ఈబీపీ) ప్రవేశపెట్టడంలో లేదా అమలు చేయడంలో తనకు ఎలాంటి బాధ్యత, సంబంధమూ లేదని గడ్కరీ తన పిటిషన్లో పేర్కొన్నారు. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడడాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంపొందించడం, పునరుత్పాదక, దేశీయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం 2003లోనే ఈబీపీని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
తదనంతరం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని దశలవారీగా పెంచుతూ 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమం(ఈ20) అమలు చేసే స్థాయికి ప్రభుత్వం చేరుకుందని, ఇది పూర్తిగా దశలవారీ విధానంలో అమలైన ప్రభుత్వ విధానమని గడ్కరీ తెలిపారు. అయితే తన కుటుంబం ఈ20 నుండి అక్రమ ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కంటెంట్ పరోక్షంగా సూచిస్తోందని, ఇది అవినీతి, అధికార దుర్వినియోగాన్ని సూచిస్తోందని ఆయన ఆరోపించారు. అనుమతి లేకుండా తన పేరు, ముఖం, స్వరం, హావభావాలను ఉపయోగించి రూపొందించిన ఫేస్-స్వాప్ వీడియోలు, ఏఐ-జనరేటెడ్ చిత్రాలు, కార్టూన్లు ఉన్న 26 లింకులను గడ్కరీ తన పిటిషన్లో వివరించారు. ప్రతివాదుల నుంచి రూ. 11 కోట్ల నష్టపరిహారాన్ని గడ్కరీ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ విచారణ చేయనున్నారు.