సింగరేణిలో కీలకమైన కారుణ్య నియామకాలపై కాంగ్రెస్ కత్తిగట్టిందా..? సంస్థ అభివృద్ధి కోసం భూగర్భంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ అనారోగ్యం బారినపడ్డ, కాళ్లు, చేతులు కోల్పోయిన వారిపై చిన్నచూపు చూస్తున్నదా..? తాము అధికారంలోకి వచ్చాక మెడికల్ బోర్డుకు వచ్చిన వారందరికీ కొలువులు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మంగళం పాడుతున్నదా..? అంటే అవుననే సమాధానమే వినిపస్తున్నది. కండ్లు కనిపించక, పక్షవాతంతో లేవలేక, కిడ్నీలు పాడై మంచానికికే పరిమితమైన, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న ఎందరో కార్మికులు తమ స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏండ్ల తరబడి తిరుగుతున్నా మెడికల్ బోర్డులు నిర్వహించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నది. విమర్శలు, ఆందోళనలతో ఈ నెల 18న తూతూమంత్రంగా పెట్టి చేతులు దులుపుకున్నది. దరఖాస్తు చేసుకున్న 2500 మందిలో కేవలం 124 మందినే పిలిచి కొందరినే అన్‌ఫిట్ చేయడం, అది కూడా క్రమ పద్ధతి పాటించకుండా నిర్వహించడంపై కార్మికులు, కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సింగరేణిలో ఖాళీలు లేవని పేర్కొంటూ సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసత్వ ఉద్యోగాలను ఎత్తేశారు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ.. తమ ఆరోగ్యాలను ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరించారు. పలు జాతీయ కార్మిక సంఘాలు చోద్యం చూడడంతో వారసత్వ హక్కులు పోగా, ఆ తర్వాత కాలంలో వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెతో కీలకపాత్ర పోషించిన కార్మికులకు రాష్ట్రం వచ్చాక వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.
అనుకున్నట్టుగానే ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా, కోర్టులు వద్దని చెప్పినా పోరాటం చేసి ఇచ్చిన మాట ప్రకారం ఇన్వాలిడేషన్ పేరిట ప్రక్రియను వేగవంతం చేశారు. ఒక్కో నెలలో మూడు, నాలుగు మెడికల్ బోర్డులు పెట్టి, పనిచేయలేని కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల కింద కొలువులు కట్టబెట్టారు. కరోనా సమయంలో ప్రత్యేక మినహాయింపు ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 3,200 ఉద్యోగాలతోపాటు కొత్తగా 13,119 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రెండు మెడికల్ బోర్డులే నిర్వహిస్తున్నది. మేం అధికారంలోకి వస్తే నెలకు మూడు, నాలుగు బోర్డులు పెడతాం. బోర్డుకు వచ్చిన ప్రతి సింగరేణి కార్మికుడి కొడుక్కు, కూతురుకు ఉద్యోగాలు ఇస్తాం. కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం’ అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కాంగ్రెస్ మంగళం పాడుతున్నది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా సక్రమంగా మెడికల్ బోర్డులు నిర్వహించకుండా రిక్రూట్ మెంట్‌ను నిర్లక్ష్యం చేసింది.
ఈ క్రమంలో నల్లనేల వ్యాప్తంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొద్దిరోజుల క్రితం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధమై, ఆందోళనలు చేయడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. గత జూన్‌లో మెడికల్ బోర్డు నిర్వహిస్తామని కార్మికుల్లో ఆశలు రేకెత్తించారు. అయితే ఈ నెల 17, 18తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖానలో తూతూ మంత్రంగా బోర్డు నిర్వహించారనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 75నుంచి 85శాతం వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ జరుగగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 25శాతం మాత్రమే చేస్తున్నారని, అందులోనూ పారదర్శకత పాటించడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సింగరేణిలో దాదాపుగా 2500 మంది వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం ఎదురు చూస్తుండగా, యాజమాన్యం ఈ నెల 18న మెడికల్ బోర్డు నిర్వహించింది. 124మందికి మాత్రమే హాజరుకావాలని సమాచారం ఇచ్చింది. అయితే 100మంది హాజరు కాగా, అందులోనూ 24మందిని మాత్రమే అన్‌ఫిట్ చేసింది. మరో 38మందిని తిరిగి విధుల్లో చేరాలని, మిగతా వారంతా విధుల్లో కొనసాగాలని ఆదేశించింది. అయితే పిలిచిన 124 మందిలో 24మందికి సరైన సమాచారం ఇవ్వకుండా వారు హాజరు కాకుండా అడ్డుకున్నదనే విమర్శలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో 2023 మార్చి 21న బోర్డు పకడ్బందీగా నిర్వహించి అర్హత కలిగిన వారిని ఆన్ఫిట్ చేసి ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యం, ఈ మూడేళ్ల కాలంలో సక్రమంగా నిర్వహించలేదు.
ఈ నెల 18న నామమాత్రంగా బోర్డు నిర్వహించింది. అయితే రెండేండ్లలోపు సర్వీసు ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుందనుకుంటే ఆ ఆశలనూ నీరుగార్చింది. గతంలో ఎప్పుడైనా మెడికల్ బోర్డులకు 200-230మందిని పిలిచేవారు. కానీ. ఇప్పుడు 2.500 మందిలో కేవలం 124మందిని పిలవడం, అందులోనూ మే నెలలో స్క్రీనింగ్ టెస్ట్ అయిన 32 మందిని కలుపడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇందులో కొద్ది మంది 2023 మార్చి మెడికల్ బోర్డు పెట్టిన తర్వాత డ్యూటీ చేయవద్దని గైర్హాజరైన వారే ఉన్నారు.
అయితే గతేడాది జరిగిన మెడికల్ బోర్డుల్లో ఇలాంటి వారిని పిలిచినా అన్ ఫిట్ చేయకుండా ఏండ్ల తరబడి వారు తమ జీతాలను నష్టపోయేలా సింగరేణి యాజమాన్యం తీరని అన్యాయం చేసిందని కార్మికులు వాపోతున్నారు. కాళ్లు లేని వారు, చేతులు లేని వారు, పక్షవాతం వచ్చిన వారు, కిడ్నీ, కళ్లు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వారిని కూడా ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులను కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం నిరంతరం మోసం చేస్తూనే ఉన్నది. కాంగ్రెస్‌వి అన్నీ ఝాటా మాటలే. వీరి మోసాన్ని గుర్తించి 120మంది కార్మికులు కోర్టును ఆశ్రయించారు. అందులో ఐదుగురిని అన్‌ఫిట్ చేసి ఉద్యోగం ఇవ్వాలని, మానవీయ కోణంలో చూడాలని న్యాయస్థానం చెప్పినా పట్టించుకోవడం లేదు. సాధారణంగా రెండేళ్ల సర్వీసు ఉన్న వారు మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. 2025 మార్చిలో రెగ్యులర్ బోర్డు నిర్వహించిన టైంలో అవకాశం రాకుండా ఉన్న వారిని అంటే కేవలం 9, 10 నెలల తక్కువ సర్వీసు ఉన్నవారిని మొన్నటి బోర్డుకు పిలవాలి.
కానీ, ఈ క్రమం పద్ధతిని పాటించకుండా వ్యవహరించారు. ఈ నెల 18న పిలిచిన 124 మందిలో కొంత మంది రెండేళ్లు, మూడేళ్లు సర్వీసు ఉన్నవారు ఉన్నారనే విరమర్శలు వినిపిస్తున్నాయి. అందులో కొందరు ఇన్వాలిడేషన్ అయ్యారని, అలా ఎలా జరిగిందని బోర్డు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఎలా..? ఎవరి ప్రోద్భలం, ప్రోత్సాహంతో బోర్డుకు వచ్చి ఇన్వాలిడేషన్ అయ్యారో..? యాజమాన్యం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు