న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కార్పొరేట్ దవాఖానాలు క్యాన్సర్ మందులపై పది రెట్ల అధిక ధరను వసూలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని వ్యాఖ్యానించింది. అన్ని మందులపై ఏకరీతిగా 16 శాతం మార్జిన్ ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దవాఖానలు తమ మందుల దుకాణాల నుంచే మందులను కొనుగోలు చేయాలని ఆదేశించడంపై కేంద్రం దృష్టి సారించాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం సూచించింది.
ఈ విధానం వల్ల సామాన్యుడే నష్టపోతున్నాడని పేర్కొంది. ఇది పూర్తిగా దోపిడీ. రిటైలర్లకు రూ.2,700కే సరఫరా అవుతున్నప్పటికీ ఆ క్యాన్సర్ మందు ఎంఆర్పీ రూ.27,000గా నిర్ణయించారు. కార్పొరేట్ దవాఖానలు ఎవరినీ వదలవు. కనీసం మృతదేహాన్ని కూడా బయటకు తీసుకెళ్లనీయవు. ఫార్మా రంగానికి దీనిపై ఏమాత్రం పట్టింపు లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు సేవా ప్రదాతల్లా కాకుండా లాభాపేక్షతో నడిచే పరిశ్రమల్లాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
డ్రగ్స్(ధరల నియంత్రణ ఉత్తర్వు(డీపీసీఓ), 2013 కింద మందుల ధరల నియంత్రణ, జెనరిక్ ప్రిస్కిప్షన్లు, వైద్య పరికరాలపై నియంత్రణలకు సంబంధించిన పిటిషన్లను విచారణ జరుపుతున్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోగులు తరచూ దవాఖాన ఫార్మసీల నుంచి అధిక ధరలకు మందులు ఎందుకు కొనవలసి వస్తున్నదని ధర్మాసనం ప్రశ్నించింది. కార్పొరేట్ దవాఖానల్లో చేరిన రోగులను కొన్నిసార్లు అక్కడి ఫార్మసీ నుంచే మందులు కొనుగోలు చేయమని ఒత్తిడి చేస్తారని కోర్టు తెలిపింది. బయట కొనుగోలు చేసిన మందులు తెచ్చిన వారికి దవాఖాన నుంచి చికిత్సకు సంబంధించిన హామీ లభించడం లేదని ఆరోపణలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది. ఒక క్యాన్సర్ మందు విషయంలో కోర్టు గత వారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది.
ప్రభుత్వ హెల్త్ స్కీములు
ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకాల పరిధిలోకి వచ్చే రోగుల విషయంలో ఉన్న భారీ వ్యత్యాసాన్ని ధర్మాసనం మరోసారి నొక్కిచెప్పింది. ప్రభుత్వ పథకం కింద ఉన్న రోగిని అధిక ధర చెల్లించేలా చేస్తే దవాఖానకు ప్రభుత్వ నిధుల నుంచి తిరిగి చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి, అంతిమంగా ఆ భారాన్ని పన్ను చెల్లింపుదారుడే మోయాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది.
ఏకరీతి మార్జిన్ ఎందుకు లేదు?
కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సమస్యను అంగీకరిస్తూ ప్రభుత్వం వివిధ ఆందోళనల మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ అధికారులతో ఈ విషయమై చర్చించి ఒక ప్రతిస్పందనను రూపొందించడానికి ఆయన కొద్దిసేపు వాయిదా కోరారు. అవసరమైన, అత్యవసరం కాని మందులకు సంబంధించిన నిబంధనల్లో ఎందుకు వ్యత్యాసం ఉందని ప్రశ్నించిన ధర్మాసనం అన్ని మందులకూ 16 శాతం ఏకరీతి మార్జిన్‌ను వర్తింపచేయవచ్చా అని అడిగింది. పెంచిన ఎంఆర్పీ వల్ల తలెత్తే మరో సమస్యను కూడా కోర్టు ప్రస్తావించింది. నిజమైన మందుల దుకాణదారుడు అదే మందును చాలా తక్కువ ధరకు అందిస్తున్నప్పటికీ రోగులకు అనుమానం కలగవచ్చని కోర్టు పేర్కొంది.
రూ.27 వేల ఎంఆర్పీ మందును కెమిస్ట్ రూ.3 వేలకే విక్రయించే ఉదాహరణను ధర్మాసనం ప్రస్తావించింది. తక్కువ ధరకు లభించే ఈ మందు నకిలీది లేదా కల్తీది అయి ఉండవచ్చని రోగి అనుమానించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. తయారీ లేదా రిటైలర్ ధర, ఎంఆర్పీ మధ్య ఉన్న భారీ వ్యత్యాసం చివరకు ఎక్కడకు వెళుతున్నదని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. ఇటువంటి ధరల వ్యత్యాసాల వల్ల ఔషధ తయారీదారులు ఎల్లప్పుడూ ప్రధాన లబ్ధిదారులుగా ఉండరని, లాభాల మార్జిన్లలో గణనీయభాగాన్ని ప్రైవేట్ దవాఖానలు పొందవచ్చని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఈ ఆర్థిక భారం చివరకు రోగులు, పన్ను చెల్లింపుదారులపైనే పడుతుందని ధర్మాసనం పేర్కొంది. కార్పొరేట్ దవాఖానలు పరిశ్రమలుగా మారాయి. సామాన్యుడు ఇదంతా ఎందుకు భరించాలి? అని ధర్మాసనం ప్రశ్నించింది.