గ్లాస్గో : పోలియో రాకసి రూపంలో వచ్చిన వైకల్యాన్ని.. పెండ్లి రూపంలో ఎదురైన కష్టాలను అధిగమించి క్రీడలకు రిటైర్మెంట్ ఇచ్చే 34 ఏండ్ల లేటు వయసులో కెరీర్ ఆరంభించిన ధీర వనిత షర్మిల ధన్‌ఖడ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. మెగా గేమ్స్ చరిత్రలో పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. మహిళల పారా షాట్‌పుట్‌లో షర్మిల స్వర్ణం గెలవగా.. ఇదే పోటీలో శిల్పా శైలా కాంస్యంతో మురిసింది. ఇంకోవైపు తండ్రి బాటలో పయనించిన తెలుగు వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు, హై జంపర్ సర్వేశ్ కుశారే రజతాలతో మెరడంతో కామన్వెల్త్‌తో భారత పతకాల సంఖ్య పదికి చేరింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎఫ్57 కేటగిరీ మహిళల షాట్‌పుట్‌లో షర్మిల గుండును 9.81 మీటర్ల దూరం విసిరి గోల్డ్ సొంతం చేసుకుంది. 20 ఏండ్ల కామన్వెల్త్ పారా అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పసిడి కావడం విశేషం.
శిల్ప 7.26 మీటర్ల త్రో చేసి కాంస్యం అందుకుంది. తొలుత నైజీరియాకు చెందిన యుకారియా ఇయాజీ మూడో స్థానంలో నిలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, భారత్ నిరసనతో నిర్వహించిన రివ్యూలో నైజీరియా అథ్లెట్ ఫౌల్ చేసినట్టు తేలడంతో శిల్పకే కాంస్యం దక్కింది. ఇక, పురుషుల హైజంప్‌లో కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్న సర్వేశ్ కుశారే రజతం అందుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోటీలో సర్వేశ్, జమైకా జంపర్ రొమైన్ బెక్‌ఫోర్డ్ ఇద్దరూ 2.25 మీటర్లు ఎత్తు దూకారు. కానీ, 2.28 మార్కును అధిగమించలేకపోయారు. విజేతను తేల్చేందుకు అంతకుముందు చేసిన ప్రయత్నాల్లో ఇద్దరు అథ్లెట్ల వైఫల్యాలను (కౌంట్ బ్యాక్) లెక్కించారు. ఒకేసారి విఫలమైన బెక్‌ఫోర్డ్ స్వర్ణం అందుకోగా.. రెండు ప్రయత్నాల్లో ఫెయిలైన సర్వేశ్ రజతంతో సంతృప్తి చెందాడు. అయినా కామన్వెల్త్ గేమ్స్ హైజంప్‌లో సిల్వర్ నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.

ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల 79కేజీ కేటగిరీలో సిల్వర్ నెగ్గాడు. 21 ఏండ్ల అజయ్ ఫైనల్లో మొత్తం 330 కిలోల బరువెత్తి రెండో స్థానం సాధించాడు. 145 కిలోలతో స్నాచ్ను ఆరంభించిన అజయ్ రెండో ప్రయత్నంలో విఫలమైనా చివరగా 149కిలోల బరువు మోసి గేమ్స్ రికార్డు సృష్టించాడు. క్లీన్ అండ్ జర్క్‌లో గోల్డ్ ఫెవరేట్‌గా బరిలోకి దిగాడు. 181 కేజీలను క్లియర్ చేసినా ఒక్క కిలో తేడాతో కొద్దిలో స్వర్ణం కోల్పోయాడు. మలేసియాకు చెందిన ఎరీ హిదాయత్ మొత్తం 331 (147+184) కేజీలతో పసిడి సొంతం చేసుకోగా.. ఇంగ్లండ్ లిఫ్టర్ క్రిస్ మర్రే (325 కేజీ) కాంస్యం అందుకున్నాడు. కాగా, మహిళల 63 కిలోల విభాగంలో నిరుపమ నిరాశపరిచింది.
ఒకవైపు వైకల్యం.. మరోవైపు నరకం చూపించే గృహ హింస.. ఇంకోవైపు ఇద్దరు చిన్నారులతో వీధిపాలైన దయనీయ స్థితి. ఇక ఈ జీవితం ముగిసిపోయింది.. ఆత్మహత్యే శరణ్యం అని అనుకున్న అత్యంత చీకటి క్షణంలో ఆమె ఒక ఓ నిర్ణయం తీసుకుంది. ‘నా జీవితానికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదు?’ అని తన్నుకొచ్చిన ఆ ఆలోచనే ఆమె భవితవ్యాన్నే మార్చేసింది. చావు అంచున నిలబడి బతుక్కి రెండో చాన్స్ ఇచ్చిన ఆ నిర్ణయమే హర్యానాకు చెందిన 42 ఏండ్ల షర్మిల ధన్‌ఖడ్ కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో పసిడి పతకం నెగ్గేలా చేసింది. హర్యానాలోని మహేందర్‌గఢ్ జిల్లా చిత్రౌలి గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది షర్మిల. తల్లి చూపులేనిది కావడంతో బాల్యం నుంచే కష్టాలు చవిచూసింది. రెండేండ్ల వయసులోనే తీవ్రమైన జ్వరం రాగా, సరైన వైద్యం అందక ఎడమ కాలు పోలియో బారిన పడింది. పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పిన ఆమెకు 19 ఏండ్లకే పెళ్లి చేశారు. అదనపు కట్నం తెమ్మంటూ భర్త తీవ్రంగా వేధించేవాడు. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కోపంతో ఓ రోజు రాత్రి 11 నుంచి 3 గంటల దాకా చితకబాది, ఇద్దరు పసిపాపలతో సహా రోడ్డుపైకి తోసేశాడు. కనీసం బస్సు చార్జీలకు కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో షర్మిల ఆత్మహత్య చేసుకోవాలని భావించినా.. పిల్లల కోసం బతకాలని నిర్ణయించుకుంది.

వారి పోషణ కోసం ఇండ్లలో పనులతో పాటు సెక్యూరిటీ గార్డుగా, స్వీపర్‌గా పనిచేసింది. ఇన్ని కష్టాల నడుమ వ్యాపారవేత్త అజిత్ సింగ్ రూపంలో ఆమెకు ఓ చేయుత లభించింది. అజిత్‌తో రెండో వివాహం జరిగాక ఆమె జీవితం మలుపు తిరిగింది. షర్మిల మానసిక దృఢత్వాన్ని, పట్టుదలను గుర్తించిన అజిత్ 2020లో (34 ఏండ్ల వయసులో) ఆమెను పారా అథ్లెటిక్స్ వైపు ప్రోత్సహించాడు. సాధారణంగా క్రీడాకారులు రిటైర్మెంట్ ప్రకటించే వయసులో షర్మిల తొలిసారి చేతిలోకి షాట్‌పుట్ గుండును పట్టింది. కోచ్‌లు టెక్ చంద్, దేవేంద్ర పర్యవేక్షణలో కఠిన సాధన చేసింది. ఆమె శిక్షణ, డైట్ ఖర్చుల కోసం కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూ 2023లో తమ సొంతింటిని కూడా అమ్మేసి అద్దె ఇంట్లోకి మారింది. 2022 కామన్వెల్త్ గేమ్స్, 2023 ఆసియా పారా గేమ్స్‌లో నాలుగో స్థానంతో తృటిలో పతకాలు చేజారినా షర్మిల వెనకడుగు వేయలేదు. పట్టువదలకుండా శ్రమించి, గ్లాస్గో వేదికగా తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కష్టాలు వచ్చినా జీవితం అక్కడితో ముగిసిపోదని షర్మిల ఈ విజయంతో నిరూపించింది. విధిరాతను ఎదిరిస్తూ.. జీవితానికి రెండో అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో ఏపీ లిఫ్టర్ శ్రీనివాసరావు 56 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలవగా.. 16 ఏండ్ల తర్వాత అతని కొడుకు అజయ్ బాబు మరో అడుగు ముందుకు వేసి రజత పతకంతో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్‌కు ఆరేండ్ల వయసు ఉన్నప్పుడు శ్రీనివాసరావు కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం గెలిచాడు. ఆ రోజు ఊరంతా తమ ఇంట్లో టీవీకి అతుక్కుపోయి సంబరాలు చేసుకోవడం, ఆ పతకం తమ కుటుంబ ఆర్థిక కష్టాలను తీర్చడం అజయ్ చిన్నతనంలోనే చూశాడు.

తండ్రి బాటలోనే క్రీడాకారుడిగా ప్రయణం ప్రారంభించాడు. శ్రీనివాసరావు స్వయంగా కొడుకుకు శిక్షణ ఇచ్చి వెయిట్‌లిఫ్టింగ్ మెళకువలు నేర్పించాడు. ఆరంభంలో తీవ్ర ఒత్తిడికి గురై జాతీయ టోర్నీల్లో విఫలమైనా.. 2024లో మోచేతి గాయంతో ఆటకు దూరమైనా తండ్రి అందించిన మనోధైర్యంతో అజయ్ మళ్లీ పుంజుకున్నాడు. గతేడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో 335 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ రజతంతో మరో మెట్టుఎక్కాడు. ప్రతిష్టాత్మక క్రీడోత్సవంలో పతకాలు నెగ్గిన తండ్రి కొడుకులుగా శ్రీనివాస్-అజయ్ అరుదైన ఘనత సాధించారు.
భారత బాక్సర్లు పతక పంచ్ విసిరారు. ప్రీతి పవార్, ప్రియా ఘంఘాస్ సెమీస్ చేరి కనీసం కాంస్యాలు ఖాయం చేసుకున్నారు. 54 కిలోల క్వార్టర్స్‌లో ప్రీతి5-0తో నికోల్ ైక్లెడ్ (ఐర్లాండ్)ను చిత్తుచేసి సెమీస్‌కు చేరుకుంది. 60 కేజీ క్వార్టర్స్‌లో ప్రియ 4-1 లియా మిచెల్ ఓడించి ముందంజ వేసింది. కానీ, పర్వీన్ 65 కేజీ క్వార్టర్స్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. ఇక, స్మిమ్మింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజన్ సెమీస్‌కు అర్హత సాధించగా, 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో సజన్ నిరాశపరిచాడు.
నటరాజ్.. హీట్‌ను 55.58 సెకన్లతో ముగించి మొత్తంగా 13వ స్థానంలో నిలిచాడు. కానీ సజన్ 28వ స్థానంతో ముగించడంతో క్వాలిఫై కాలేకపోయాడు. పారా స్విమ్మింగ్‌లో ఏపీ కుర్రాడు రవి, అలి ఇమామ్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో 6, 8వ స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు. పురుషుల 400 మీటర్ల రేసులో నేషనల్ రికార్డు హోల్డర్ విశాల్ టీకే భారత పతక ఆశలను సజీవంగా నిలిపాడు. రౌండ్ 1 హీట్ 6లో రేసును 46.49 సెకన్లలో పూర్తి చేసి 14వ స్థానం సాధించాడు. టాప్-16లో ఉన్న అథ్లెట్లు సెమీస్‌కు క్వాలిఫై అవుతారు. కానీ మరో అథ్లెట్ రాజేశ్.. హీట్ 3ను 47.43 సెకన్లతో ముగించి మూడో స్థానంలో నిలిచినా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై కాలేదు.