Rama Nandana | సోషల్ మీడియాలో యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రమా నందన పేరు గత కొద్దిరోజులుగా ఓ కేసు నేపథ్యంలో వార్తల్లో నిలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆమెను హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య నందన తాజాగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రమా నందన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫొటోను పంచుకుంటూ భావోద్వేగంతో కూడిన క్యాప్షన్ రాసింది. సెప్టెంబర్ 7న గ్రౌండ్లోకి అడుగుపెట్టిన సమయంలో తన జీవితంలో ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆమె ఆ పోస్ట్‌లో గుర్తు చేసుకుంది.
ప్రస్తుతం తనపై కొనసాగుతున్న కేసు, న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలో నందన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే తన తాజా పోస్టులో మాత్రం కేసు గురించి ఆమె ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తనకు ఎదురైన పరిస్థితిని వ్యక్తిగత అనుభూతిగా మాత్రమే పంచుకుంది. కాగా, రమా నందన, ఆమె భర్త మధుకర్‌కు సంబంధించిన వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ కేసులో ఓ బాధితుడు తాను నందన ద్వారా మోసపోయానని, సుమారు రూ.15 లక్షలు చెల్లించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నందనపై లుక్ఔట్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం.
సెప్టెంబర్ 7న రమా నందన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ఔట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తించారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత పోలీసుల నోటీసుల మేరకు నందన విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా ‘డెస్టినీ కన్సల్టెన్సీ’కి సంబంధించిన వ్యవహారాలపై పోలీసులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నందన గతంలోనే చెప్పింది. ఆ వ్యవహారాలను తన భర్త మధుకర్ చూసుకుంటారని విచారణలో ఆమె వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.అంతేకాకుండా తనపై, తన కుటుంబంపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని నందన గతంలో ఆరోపించారు