సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నేపథ్యంలో బోయినపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకుడు కొంకటి శేఖర్ మండిపడ్డారు. ఉదయం 4 గంటలకే నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
సీఎం సభ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు సభ వద్ద నిరసన వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని కొంకటి శేఖర్ ఆరోపించారు. ‘ప్రజాపాలన’ అని చెబుతూ మరోవైపు ‘ప్రతీకార పాలన’ సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే కారణంతో పోలీసుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తుందని కొంకటి శేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కొంకటి శేఖర్, దేశాయిపల్లి సర్పంచ్ నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, మన్వాడ సర్పంచ్ కట్ట గోవర్ధన్, బీఆర్ఎస్ యువజన నాయకులు మల్లారపు చందు, దూస మధు, వర్ధవెల్లి మాజీ సర్పంచ్ రాజు, తిరుపతి, తోంటి మధుకర్, నాగుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మోతె ఎల్లారెడ్డి, గురిజాల కోటి, కోనుకటి చంద్రయ్య ఉన్నారు.