Encounter : జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లోని బుద్గాం జిల్లా (Budgam district) లో ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. భద్రతా బలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య ఇవాళ (బుధవారం) ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా (LeT) కి చెందిన ఓ టాప్ కమాండర్ (Top Commander) హతమయ్యాడు. హతమైన ఉగ్రవాదిని సులేమాన్ షా (Suleman Shah) అలియాస్ ‘మూసా (Moosa)’ అలియాస్ ‘ఫౌజీ మూసా (Fauji Moosa)’ గా అధికారులు గుర్తించారు.
బుద్గాంలో లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఎన్కౌంటర్ గట్టి ఎదురుదెబ్బ అని భద్రతావర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుద్గాం జిల్లాలోని ఎగువ ప్రాంతాలైన యూస్మార్గ్ పరిధిలోని కోరాగ్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. యూస్మార్గ్లోని దూద్‌పత్రి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కదలికలను గమనించిన సైనికులు వారిని లొంగిపోవాలని హెచ్చరించారు.
కానీ ఉగ్రవాదులు లొంగిపోకుండా కాల్పులకు తెగబడటంతో భద్రతాబలగాలు దీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో సులేమాన్ షా అక్కడికక్కడే హతమయ్యాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పిర్ పంజాల్ పర్వతశ్రేణుల్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మూసా కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడి కోసం భద్రతాదళాలు చాలాకాలంగా గాలిస్తున్నాయి. గతంలో సెప్టెంబర్ 5న యూస్మార్గ్ కొండల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ నుంచి మూసా చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ ఎన్కౌంటర్లో అతని సహచరుడు యాసిర్ హతమయ్యాడు.