తిరుపతి : ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం రూపుదిద్దుకుంటుందని టీటీడీ (TTD) ఈవో ఏవి.ధర్మారెడ్డి (Dharmareddy) అన్నారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి(Triupati)లో నాలుగు రోజుల విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు విజ్ఞాన భాండాగారాలని అన్నారు. ఆధునిక మానవ సమాజం శాంతి సౌఖ్యాలతో జీవించడానికి వేదాలు, ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం దాగి ఉందన్నారు. ఆధునిక శాస్త్రాలను వేద శాస్త్రాలను కలపడం ద్వారా పరిమితులకు మించి, వినూత్న ఆవిష్కరణలను తీసుకురావడానికి సమ్మేళనం ఒక వేదికగా పనిచేయాలని ఆకాంక్షించారు.
మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగపడే కొత్త పరిష్కారాలను అన్వేషించడానికి రెండింటినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. న్యూఢిల్లీలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొపెసర్ శ్రీనివాస వరఖేడి తదితరులు మాట్లాడారు. వేద విజ్ఞానం సదస్సులో అమెరికా, ఆస్ట్రేలియా, నేపాల్ వంటి దేశాల నిపుణులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు.