KTR | మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరమని అన్నారు. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని రేవంత్ సర్కార్ ప్రమాదంలోకి నెడుతుందని తెలిపారు. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే అని ఆరోపించారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది అని చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్… pic.twitter.com/TvCYPMcn2M
— KTR (@KTRBRS) March 2, 2026
కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.