Nayanika | టాలీవుడ్లో మరో గ్రాండ్ వెడ్డింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 6న జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం అల్లు కుటుంబంలో ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాబోయే వధూవరులు మ్యారేజ్ ఫోటోషూట్ నిర్వహించగా, ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ జంటకు సినీ ప్రియులు, అభిమానులు ముందుగానే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ ఫోటోషూట్‌లో నయనిక షేర్ చేసిన ఓ ప్రత్యేక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అల్లు వారింటికి కాబోయే కొత్త కోడలు తన ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముగ్గురూ ఫ్యాషన్ ఐకాన్స్‌లా స్టైలిష్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. “పిక్ అదిరిపోయింది” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్త కుమార్తె నయనిక ప్రస్తుతం స్వయంగా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2023 అక్టోబర్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహ వేడుకల సందర్భంగా హీరో నితిన్, ఆయన భార్య నిర్వహించిన గెట్ టూ గెదర్‌లో శాలిని స్నేహితురాలైన నయనికను అల్లు శిరీష్ మొదటిసారి కలుసుకున్నారు.
మొదట స్నేహితులుగా ప్రారంభమైన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలం సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. మార్చి 6 తేదీకి అల్లు కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉంది. అదే రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకుంటారు. అన్న, వదిన పెళ్లి రోజునే తాను కూడా వివాహ బంధంలో అడుగుపెట్టాలని అల్లు శిరీష్ నిర్ణయించుకోవడం విశేషంగా మారింది. మార్చి 6న జరగనున్న ఈ వివాహం కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపగా, కొందరిని స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.