Road accident : కెనడాలో పారిపోతున్న దొంగను పోలీసులు వెంబడించడం ముగ్గురు భారతీయుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతోపాటు వారి మూడు నెలల మనుమడు ప్రాణాలు కోల్పోయారు.
కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో ఓ దొంగ లిక్కర్ దుకాణంలో దోపిడీకి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా తన కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు తమ వాహనంలో ఆ దొంగను వెంబడించారు.
ఈ క్రమంలో ఆ దొంగ రాంగ్ రూట్లో వెళ్లి భారతీయులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు 60, 55 ఏళ్ల వయస్సున్న ఇద్దరు భారతీయ దంపతులు, మూడు నెలల వయస్సున్న వారి మనుమడు, మరో కారులో వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టిన దొంగ ఉన్నారు.
ప్రమాదంలో మరణించిన మూడు నెలల చిన్నారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భారత్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు తమ కూతురు కుటుంబాన్ని చూసేందుకు కెనడాకు వచ్చారని, ఈ క్రమంలో ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.