Praja Chaitanya Vedika : పశ్చిమాసియాలో పెట్రోల్ నిల్వలను దోచుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కోదాడలోని ఎమ్మెస్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ‘ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడి నేపథ్యం.. భారత దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు .
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందనే అభియోగంతో ఆ దేశంపై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయేల్.. పాఠశాలలపై, ఆసుపత్రులపై దాడి చేసి పసిపిల్లలను, సాధారణ ప్రజలను చంపటం దుర్మార్గమని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయకూడి వెంకటేశ్వరరావు అన్నారు. ‘ఆపరేషన్ ఎపిక్యూరీ’, ‘ఆపరేషన్ మిడ్నైట్’ల పేరుతో రెండు దేశాలు ఇరాన్ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయడం, విధ్వంసానికి పాల్పడడం సహేతుకం కాదని ఆయన మండిపడ్డారు. అక్కడి చమురు నిక్షేపాలను తమ దేశానికి తరలించి, ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న అమెరికా చేస్తున్న కుట్రలో భాగమే ఈ యుద్ధం అని ఆయన వెల్లడించారు.
అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్త దాడుల ఫలితంగాహోర్మోజ్ జల సంధిని ఇరాన్ మూసి వేసిందని.. ఫలితంగా భారతదేశం సహా అన్ని దేశాల్లోని ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నారనిఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడ ఖాయమని రాయకూడి వెంకటేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడం కోసం అమెరికా, ఇజ్రాయేల్‌పై ఒత్తిడిని పెంచడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ప్రజా చైతన్య వేదిక కోరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపర్తి రామ నరసయ్య, 10వ వార్డ్ కౌన్సిలర్ మామిడి రామారావు, బీఆర్ఎస్ నాయకుడు షేక్ నయీం, పొనుగోటి కోటయ్య, పాకనాటి రాఘవరెడ్డి, జె ఆర్ కె మూర్తి, అరుణోదయ ఉదయగిరి, అంజయ్య, నారపరాజు, హరికిషన్ రావు, జలంధర్, నాగరాజు, గోపీలు తదితరులు పాల్గొన్నారు.