మోర్తాడ్, జూలై 30: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. వానాకాలం ప్రారంభమైన రెండునెలలకు ఇన్‌ఫ్లో రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, మరోవైపు ఎస్సారెస్పీ డెడ్‌స్టోరేజీకి దగ్గరలో ఉండడం, జూలై ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు మేరకు మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినప్పటికి ఎస్సారెస్పీకి వరద రాకపోవడంతో వానాకాలం సాగుపై రైతులు ఆందోళన చెందారు.
ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ప్రాజెక్ట్‌లో నీళ్లు లేకపోవడంతో రివర్స్‌పంపింగ్ ద్వారా వరదకాలువలోకి నీళ్లు తెప్పించాలనే రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. వాయుగుండం రూపంలో రెండుమూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడం, ఎగువ మహారాష్ట్రలో సైతం వర్షాలు కురుస్తుండడంతో ఎస్సారెస్పీకి ఒక్కరోజులోనే భారీగా వరద రావడం ప్రారంభమైంది. దీంతో మరోరెండుమూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంటుందని, వానాకాలం పంటలకు ఢోకా ఉండదన్న ఆశతో రైతులు ఉన్నారు.
ఎస్సారెస్పీకి ఒక్కరోజులోనే భారీగా వరద ప్రారంభమైంది. గురువారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో ప్రాజెక్ట్‌కు 76,634 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేవలం 3,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, గురువారం ఉదయం 6 గంటలకు 6,250 క్యూసెక్కుల వరద వచ్చింది. ఉదయం 9గంటలకు 9,240 క్యూసెక్కుల వరద కొనసాగగా మధ్యాహ్నం 2గంటల వరకు 19,258 క్యూసెక్కులకు పెరిగింది.
సాయంత్రం 4గంటలకు 35,654 క్యూసెక్కులకు వరద పెరగగా, 5గంటలకు 48,147 క్యూసెక్కులు, 6గంటలకు 72,452 క్యూసెక్కుల వరద వచ్చింది. ఒక్కరోజులోనే దాదాపు 2టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చిచేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ప్రాజెక్ట్‌కు వచ్చిన భారీ వరదగా చెప్పవచ్చు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1066.8అడుగుల (18.444టీఎంసీలు)నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి అవుట్‌ఫ్లో 751 క్యూసెక్కులు కాగా, కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా 220 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.