దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్
(తైత్తిరీయ ఉపనిషత్ 1.11.2)
దేవకార్యం, పితృకార్యం విషయంలో అశ్రద్ధ
పనికిరాదు.. అని భావం. పితృకార్యం అంటే శ్రాద్ధాది కర్మలే!
కర్ణుడు జీవితాంతం ఎవరు ఏదడిగినా లేదనకుండా దానం చేసేవాడు. ధనం, బంగారం, వజ్రాలు అడిగిన వారికి అడిగినట్టు ఇచ్చేసేవాడు. ఆ వస్తువు ఎంత ఖరీదైనదీ పరిగణనలోకి తీసుకునేవాడు కాదు. కానీ, కర్ణుడు అన్నదానం చేసి ఎరుగడు. అన్నం పెట్టడం అనే ఆలోచనే అతనికి రాలేదు. ఎందుకంటే అతను దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు వీరమరణం పొంది స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అతనికి తినడానికి బంగారం, వెండి, వజ్రాలనే భోజనంగా పెట్టారు. వాటిని భుజించలేక విస్తుపోయిన కర్ణుడు ఇదేమిటని దేవేంద్రుడిని అడిగాడు.
‘కర్ణా! భూలోకంలో ఏది దానం చేస్తే అదే ఇక్కడ భోగంగా వరిస్తుంది. నువ్వు జీవితమంతా బంగారమే దానం చేశావు. అన్నార్తులకు ఒక్కసారి కూడా అన్నం పెట్టలేదు. అందుకే నీకు బంగారమే ఆహారంగా లభిస్తున్నది’ అన్నాడు ఇంద్రుడు. తన పొరపాటు గ్రహించిన కర్ణుడు ‘అన్నదానం చేయలేని తక్కువతనం నాకు ఎందుకు? దయచేసి కొద్ది రోజులు నన్ను భూలోకానికి పంపండి. అన్నదానం చేసి వస్తాను’ అని ప్రార్థించినాడు. దేవేంద్రుడు దేవతలతో సమావేశం జరిపి ‘తిరిగి భూలోకానికి పంపడం కుదరదు. అయినప్పటికీ నీవు చేసిన విలువైన దానాలు, వాటివల్ల సంక్రమించిన పుణ్యం పరిగణనలోకి తీసుకొని భూమి మీదకు 15 రోజులపాటు వెళ్లడానికి అనుమతి ఇస్తున్నాము’ అని కర్ణుడిని భూమిపైకి పంపాడు. ఆ కాలాన్నే మహాలయ పక్షం అంటాం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులే పితృపక్షం. ఆ రోజులలో కర్ణుడు పేదలకు, బ్రాహ్మణులకు విశేషంగా అన్నదానం, కీర్తిశేషులైన తల్లి వైపు, తండ్రి వైపు వారికీ బంధువులకు, గురువులకు అందరికీ ఎంతో శ్రద్ధతో తర్పణాలు విడిచాడు. శ్రాద్ధ కర్మ నిర్వహించాడు. దానివల్ల పితృలోకంలో ఉన్న వారికి ఆత్మ శాంతి కలిగింది. వారి ఆశీస్సులు ప్రాప్తిస్తాయని సంప్రదాయజ్ఞులు నొక్కి వక్కాణిస్తారు. తర్వాత కర్ణుడు తిరిగి స్వర్గానికి వెళ్లి తృప్తిగా జీవనం సాగించాడు.