నిజాంసాగర్, జూలై 30: మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటుచేసిన ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద బార్డర్ చెకింగ్ పేరిట అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నది. గతంలో ఇక్కడ రవాణా, ఎక్సైజ్ శాఖల రెండు చెక్‌పోస్టులు ఉండగా, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో ఇక్కడ కూడా ఎత్తేశారు. ఎక్సైజ్ శాఖకు చెందిన చెక్‌పోస్టు మాత్రం అలాగే ఉన్నది. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది లారీలను బార్డర్ చెకింగ్ పేరిట తనిఖీలు చేసి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ మహారాష్ట్ర నుంచి చెక్‌పోస్టు మీదుగా వస్తుండగా ఇక్కడ ఎక్సైజ్ దుస్తులతోఉన్న ఓ వ్యక్తితోపాటు మరో ఇద్దరు సిబ్బంది కలిసి లారీని నిలిపేసి డబ్బులు అడిగారు. దీంతో లారీ డ్రైవర్ డబ్బులు ఎందుకివ్వాలని, ఒంటిపై ఉన్న డ్రెస్‌పై డిపార్ట్మెంట్ పేరు ఏమిలేదని ప్రశ్నిస్తూనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గామారింది. లారీ డ్రైవర్ ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమే కదా అంటూ మండిపడుతున్నారు.