blue drum case : బ్లూడ్రమ్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, మీరట్‌లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుల్ని కోర్టు దోషులుగా నిర్ధరించింది. మృతుడు సౌరభ్ రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా గుర్తించింది. హత్య జరిగిన 13 నెలల్లోపే విచారణ పూర్తికాగా, నిందితుల్ని దోషులుగా తేలుస్తూ కోర్టు బుధవారం నిర్ణయించింది. ఈ కేసులో 126 వాదోపవాదాలు జరిగాయి.
22 మందికిపైగా సాక్షుల్ని కోర్టు విచారించింది. ప్రస్తుతం నిందితులు ముస్కాన్, సాహిల్ జైలులోనే ఉండటంతో.. వారి భద్రత, వివిధ కారణాల దృష్ట్యా కోర్టు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని విచారించింది. విచారణ అనంతరం వారి పాత్రపై తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ముస్కాన్ మూడు రోజులుగా జైలులో ప్రార్థనలు చేస్తూ ఉండిపోయింది. సాహిల్ తోటివారితో మాట్లాడటం కూడా మానేశాడని జైలు అధికారులు తెలిపారు.
నిర్ణయం వెల్లడించే సమయంలో జడ్జి.. ముస్కాన్‌ను ఈ కేసు గురించి ప్రశ్నించినట్లు సమాచారం. తాను చేసిన నేరంపై ఇప్పుడెలా ఫీలవుతున్నారని జడ్జి అడిగారు. ఈ హత్య ఘటన సమాజంలో తీవ్ర భయాన్ని కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. సౌరభ్ మృతిలో ముస్కాన్, సాహిల్ పాత్ర రుజువైంది. వారిద్దరూ నేరం చేసినట్లు కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇద్దరికీ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
బ్లూ డ్రమ్ హత్య కేసు ఇది
యూపీ, మీరట్‌కు చెందిన మాజీ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్ (29) మార్చి, 2025లో హత్యకు గురయ్యాడు. అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిలు శుక్లా కలిసి అతడిని హతమార్చారు. అనంతరం పెద్ద బ్లూ డ్రమ్‌లో అతడి శవాన్ని ఉంచి, పైనుంచి సిమెంట్ పోశారు. దీంతో అతడు అందులోనే కూరుకుపోయాడు. ఘటన జరిగిన కొన్ని రోజులకు పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ హత్య ఘటన బయటపడింది. సౌరభ్, ముస్కాన్ దంపతుల మధ్యలోకి ముస్కాన్ క్లాస్మేట్, ఆమె ప్రియుడు సాహిల్ వచ్చాడు.
ఎప్పుడో కలిసి చదువుకున్న వీరు 2019లో వాట్సాప్ ద్వారా తిరిగి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇద్దరిమధ్య సంబంధం ఏర్పడింది. దీంతో వీరి బంధానికి అడ్డుగా ఉన్న ముస్కాన్ భర్త సౌరభ్‌ను చంపేందుకు ఇద్దరు కలిసి కుట్ర చేశారు. హత్య చేసి, బ్లూ డ్రమ్‌లో అతడి మృతదేహాన్ని సిమెంట్‌తో కప్పేశారు.