Google Play Store | ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం.. ఆన్ లైన్ ఆర్థిక లావాదేవీలు మొదలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వరకూ.. యుటిలిటీ బిల్లుల చెల్లింపుల నుంచి క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ.. ప్రతిదీ డిజిటల్ లావాదేవీలే.. ఆర్థికేతర అంశాలూ ఆన్ లైన్ లోనే నిర్వహించడానికి పలు రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. డిజిటలైజేషన్ పెరుగుదలకు అనుగుణంగానే సైబర్ మోసగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి.. ఆయా విభాగాల యాప్ లను పోలిన యాప్స్ తయారు చేసి గూగుల్ ప్లే స్టోర్‌లో జత చేసేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఇలా యాప్స్ ద్వారా సేవలు పొందేందుకు ప్రభుత్వ విభాగాలను పోలిన యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంతో పలువురు మోసపోతున్నారు. దీంతో వివిధ ప్రభుత్వ యాప్ లకు లేబుల్స్ వాడాలని గూగుల్ సిద్ధమైంది.
‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి ‘ఎక్స్’లో గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారికి తేలిగ్గా గుర్తించగలుగుతున్నారు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ దర్శనం ఇస్తుంది. ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తే ఒక పాప్-అప్ ఓపెన్ అయి ‘వెరిఫైడ్’ అని చూపితే అసలైన యాప్ నిర్ధారించవచ్చు. సర్టిఫైడ్ యాప్స్ కోసం బ్యాడ్జీలను ప్రవేశ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, డెవలపర్లతో కలిసి పని చేసినట్లు గూగుల్ వెల్లడించింది.