Harish Rao | ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పక్క రాష్ట్రమైన కేరళలో మాత్రం వందల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని మంచి నీళ్లలా పారబోస్తున్నారని విమర్శించారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ఫోటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్స్ చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందని అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇక్కడ ప్రజల గొంతు కోసి, కేరళలో కలర్ పేజ్ యాడ్స్ ఇస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు ప్రతి ఇంటి గడప నుంచి మొదలయ్యాయని అన్నారు. మహాలక్ష్మి పేరిట ప్రతి నెలా 2500 ఇస్తామని మహిళలను మహా మోసం చేశారన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం జాడ లేదని.. కాలేజీ పిల్లలకు ఇస్తామన్న స్కూటీల ముచ్చటే లేదని తెలిపారు. ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డల కంట్లో మట్టికొట్టి.. కేరళ పత్రికల్లో మాత్రం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశాం అని సిగ్గులేకుండా దొంగ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ పాపపు సర్కార్ ఆడబిడ్డల కడుపు కొట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగ యువతకు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని ఊదరగొట్టారని గుర్తుచేశారు. నమ్మి ఓటేసిన పాపానికి.. ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కితే అశోక్ నగర్ వీధుల్లో, ఉస్మానియా క్యాంపస్ లో అర్ధరాత్రులు విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు.
బడుల్లో చదువుకునే పిల్లలకు కనీస వసతులు లేవు కానీ.. ముఖ్యమంత్రి అమెరికా టూర్లకు, ఆయన విమాన ఖర్చులకు మాత్రం విద్యాశాఖ ఖాతాల్లోంచి కోట్లు మళ్లించుకుంటారని హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ యువత భవిష్యత్తును అంధకారం చేసి.. కేరళలో మాత్రం తెలంగాణలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాం అని పచ్చి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. చదువుకున్న బిడ్డల వీపులను లాఠీలతో పగలగొట్టిన రేవంత్ సర్కారు.. పొలాల్లో కష్టపడే రైతన్నలను కూడా వదిలిపెట్టలేదని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ అన్నదాతలను నిలువునా ముంచారన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కొర్రీలు పెట్టి సగానికి పైగా రైతులను నట్టేట ముంచారని విమర్శించారు.
కేసీఆర్ పండుగలా ఇచ్చిన రైతుబంధును ఆపేశారని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రెండు సీజన్ల పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారని, మరో సీజన్లో అరకొరగా ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్‌కి అయితే అసలు దిక్కులేదని అన్నారు. ఎకరానికి 15 వేల రైతుభరోసా లేదు.. ప్రాణం పోతే రైతు బీమా లేదని అన్నారు. వరికి 500 బోనస్ అని చెప్పి.. కేవలం సన్నాలకే అంటూ మెలిక పెట్టి, 80 శాతం దొడ్డు వడ్లు పండించే రైతుల పొట్టగొట్టారని మండిపడ్డారు. ఆ సన్నాలకు కూడా పోయిన పంటల బోనస్ ఇంకా విడుదల చేయలేదని.. కనీసం యూరియా సరఫరా చేసే తెలివి లేదని మండిపడ్డారు. కానీ రైతులను ఉద్ధరించినామని ఇతర రాష్ట్రాలో డబ్బా కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు.
పొలాల్లో రైతన్నను దగా చేసిన ఈ ప్రభుత్వం.. సమాజంలో ఆసరా లేని వృద్ధులను సైతం తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. మేము అధికారంలోకి వస్తే మొదటి నెల నుంచే రూ. 4,000 పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు గొప్పగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ మాటను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. పెరిగిన పెన్షన్ వస్తుందని ప్రతినెలా ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఈ రెండున్నరేళ్లుగా నిరాశే మిగిలిందని తెలిపారు. ఇక్కడ ఆసరా కోసం ఎదురుచూసే అభాగ్యులకు, వికలాంగులకు పెంచిన పెన్షన్ ఇవ్వడానికి చేతులు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఇక్కడి డబ్బును తీసుకెళ్లి కేరళ మలయాళ పత్రికల్లో తెలంగాణలో సంక్షేమ పండుగ అని అబద్ధపు యాడ్స్ ఇచ్చుకోవడానికి చేతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ను చెల్లించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో మాత్రం తమది అద్భుత పాలన అని పబ్లిసిటీ చేసుకుంటుందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ప్రజాధనం దోపిడీ కేవలం ఒక్క కేరళకే పరిమితం కాలేదని అన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా.. ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్మునే వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడ కమీషన్ల రూపంలో దండుకుంటున్న వేలాది కోట్ల రూపాయలను ఇతర రాష్ట్రాల ఎన్నికలకు మళ్లిస్తున్నారనేది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. అధిష్టానాన్ని మెప్పించడానికి తెలంగాణ ఖజానాను కాంగ్రెస్ పార్టీకి అక్షయ పాత్రగా మార్చారని అన్నారు.
సమాజంలో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అడుగడుగునా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇక్కడ అమలు కాని పథకాలను కేరళలో అమలవుతున్నట్లు యాడ్స్ ఇవ్వడం వారి మోసపూరిత ధోరణికి నిదర్శనమని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజాధనాన్ని.. మీ పార్టీ పబ్లిసిటీ కోసం ఇతర రాష్ట్రాల్లో తగలెయ్యడానికి మీకేం హక్కు ఉందని నిలదీశారు. స్వరాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడువలేని రేవంత్ రెడ్డి, పరాయి రాష్ట్రాల్లో ఫేక్ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని ఈ సందర్భంగా కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆయనలో ఇంకా కాస్త నైతికత మిగిలి ఉన్నా.. ఇతర రాష్ట్రాల్లో ప్రజాధనంతో చేసే ఈ దొంగ ప్రచారాలు తక్షణమే ఆపాలని సూచించారు. ఆ యాడ్స్ కోసం ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.