శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Mar 26, 2020 , 15:44:37

ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి సత్యవతి రాథోడ్‌

ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దాం : మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు ప్రజలు కచ్చితంగా పాటించాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అందరం ఇళ్లలోనే ఉందాం.. కరోనాను కట్టడి చేద్దామని మంత్రి అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలపై జిల్లాలోని తహసిల్దార్‌ కార్యాలయాలతో నేడు మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా వైరస్‌ కట్టడికి దేశం, రాష్ట్రం లాక్‌డౌన్‌ చేసిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ప్రభుత్వంతో పనిచేయాలన్నారు. వైద్యశాఖ సిబ్బంది, పోలీస్‌ యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బంది కరోనా కట్టడికి నిరంతరాయంగా కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

స్థానికులకు ఇప్పటి వరకు కరోనా సోకలేదని ఇది సంతోషకరమైన అంశమని మంత్రి అన్నారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 115 మందిని క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. వీరిలో 70 మందిని 14 రోజుల తర్వాత డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగే లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందిగా చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కుమారి అంగోతు బిందు, కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.


logo