గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 11:52:49

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వ‌ర్షాలు.. నీట మునిగిన పంటలు

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వ‌ర్షాలు.. నీట మునిగిన పంటలు

కరీంనగర్: జిల్లాలో రాత్రినుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. అనేక చోట్ల వరి పంట నేలకొరిగింది. పత్తి చేలలో నీళ్లు నిలిచాయి. గంగాధర, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట మండలాల్లో వరికి నష్టం వాటిల్లింది. చిగురుమామిడి మండలం ఇందుర్తి వద్ద మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇందుర్తి- కోహెడ మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. ఓగులాపూర్, ఇందుర్తి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

హుజూరాబాద్ లో చిలుక వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా.. వాగు ఒడ్డున ఉన్న నివాస ప్రాంతాలకు వరద వస్తోంది. ఇండ్లలోకి నీరు వస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లా కేంద్రమైన కరీంనగర్ లో పలు లోతట్టు ప్రాంతాలకు వరద వచ్చింది. నగరంలో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతుండటంతో ఎల్ఎండీ జలాశయంలో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది. 18 గేట్ల ద్వారా 84,034 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. కాగా ఈ రోజు ఉదయం వరకు 50.6 మిల్లీ మీటర్ల సగటు వర్ష పాతం నమోదయ్యింది. ఇల్లందకుంట, చిగురుమామిడి,  జమ్మికుంట, సైదాపూర్, తిమ్మాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. logo