సర్కార్ వైద్యం పై పట్టింపేదీ..!
సర్కార్ వైద్యంపై పట్టింపులేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రసవానికి వచ్చిన గర్భిణులు, పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండాపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో పెద్దాసుపత్రి ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్నది.
- మాతాశిశు కేంద్రంలో నిండు ప్రాణాలు బలి
- తల్లీబిడ్డల ప్రాణాలకు గ్యారెంటీ నిల్
- ఐసీయూ లేదు.. బ్లడ్‌బ్యాంకు లేదు
- నిర్లక్ష్యాన్ని వీడని వైద్యులు
- కలెక్టర్ చొరవ చూపినా మారని తీరు
- పెద్దాసుపత్రిలోనూ సౌకర్యాల కొరత
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ రామవరం, ఏప్రిల్ 26 : సర్కార్ వైద్యంపై పట్టింపులేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రసవానికి వచ్చిన గర్భిణులు, పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండాపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో పెద్దాసుపత్రి ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్నది. దీనికితోడు పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని రామవరంలో ఉన్న మాతాశిశు కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ప్రత్యేకంగా వైద్యసేవలు అందుతున్నాయి. ఈ మాతాశిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం, సౌకర్యాల లేమి కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రసవ సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతున్నది. మొన్నటివరకు వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న పెద్దాసుపత్రి ‘మెడికల్ కాలేజీ’ రావడంతో డీఎంఈ పరిధిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే డీఎంఈ కంట్రోల్‌కి వెళ్లిందో నాటినుంచి పాత క్యాడర్ అంతా ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలకు వెళ్లిపోయారు.
వారిస్థానంలో కొత్తగా వచ్చిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తల్లీబిడ్డలు మృత్యువాత పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం సర్కార్ ఆసుపత్రిపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడంతో మాతాశిశు కేంద్రానికి గర్భిణులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులు భయంతో వణికిపోతున్నారు. రామవరంలో ఉన్న మాతాశిశు కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది. గత జనవరి నెలలో సుజాతనగర్ మండలానికి చెందిన తల్లీబిడ్డ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిన ఘటన మరవకముందే ఈ నెల 25వ తేదీ గురువారం జూలూరుపాడు మండలానికి చెందిన మరో తల్లి బానోత్ చంద్ర పెద్దాసుపత్రిలో ప్రాణాలు విడిచింది. ఎంతో హృదయ విదారకమైన ఘటనలు సర్కార్ ఆసుపత్రిలో జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో జనం అసహ్యించుకుంటున్నారు.

కనీస సౌకర్యాలూ కరువు..
ఎన్నో సౌకర్యాలు కలిగి ఉండాల్సిన సర్కార్ ఆసుపత్రిలో కనీసం తాగునీరు కూడా లేదంటే నమ్మరేమో? మాతాశిశు కేంద్రంలో తాగునీరు లేక తల్లులు అల్లాడిపోతున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. నీళ్లకోసం ఆరుబయట చలివేంద్రాల వద్దకు వచ్చి తీసుకెళ్లాల్సిన దుర్భరమైన దుస్థితి. వాటర్కూలర్లు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. ఏసీలు లేకపోవడంతో ఎండాకాలం గర్భిణులు ఉక్కపోతకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోగులతో వచ్చే సహాయకులు వరండాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఏదేమైనా తల్లీబిడ్డల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోవడంతో తెగ భయపడిపోతున్నారు.
ఐసీయూ లేదు.. బ్లడ్‌బ్యాంక్ లేదు..
రామవరంలో ఉన్న మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ కూడా లేకపోవడం విడ్డూరంగా ఉంది. బ్లడ్ తక్కువ అయితే బ్లడ్ ఎక్కించే సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో లేదు. దీంతో పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుంటారు. డెలివరీ సమయంలో సీరియస్ అయినప్పుడు ఐసీయూ లేకపోవడం వల్ల వెంటిలేటర్ సాయం అందక మృతిచెందుతున్నారు. గతంలో, నిన్న చనిపోయిన తల్లీబిడ్డల పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ సౌకర్యంపై వైద్యులు ఎందుకు పెద్ద అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లేదో అర్థం కాని విషయం.
కలెక్టర్ చొరవ చూపినా..
జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాసుపత్రిపై కలెక్టర్ ప్రియాంక ఆల ఒకరోజు ప్రత్యేకంగా అన్ని విభాగాల వైద్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్లక్ష్యం వీడాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినా వైద్యుల తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. గతంలో పనిచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు మధ్య ఉన్న కోల్డ్‌వార్ వల్ల వైద్యుల మధ్య సఖ్యత లేదని తెలియడంతో సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అయినా సూపరింటెండెంట్ స్థానంలో సరైన పర్యవేక్షకులు లేకపోవడంతో మళ్లీ కథ మొదటికే వచ్చినట్లయింది. అజమాయిషీ చేయాల్సిన ప్రిన్సిపాల్ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎవరికివారే యమునా తీరేలా ఉంది. నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై కొరఢా ఝులిపిస్తే తప్ప సర్కారు ఆసుపత్రి గాడిలో పడదేమోనని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదు..
మాతాశిశులో ఇప్పటికి ఇద్దరు మాత్రమే చనిపోయారు. నిన్న చనిపోయిన తల్లి డెలివరీ సమయంలో బాగా బ్లీడింగ్ అవడం వల్ల చనిపోయారు. అలాంటి కేసులు చాలా అరుదు. వెంటిలేటర్ కూడా ఉంది. బెటర్ ట్రీట్మెంట్ కోసం జిల్లా ఆసుపత్రికి షిప్టు చేయడం జరిగింది. గైనిక్‌లు ఉన్నారు. సర్జన్లు ఉన్నారు. వైద్యులు కొరత లేదు. నిర్లక్ష్యం అసలే లేదు.
– డాక్టర్ రాధామోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్
మందులు బయటనే తీసుకోమంటున్నారు..
మా ఇద్దరు పిల్లలకు మలేరియా అని తేలింది. అశ్వారావుపేట నుంచి ఇక్కడికి పంపించిండ్రు. ఈడికొచ్చిన తర్వాత మందుల్లేవ్ బయట తీసుకోమన్నారు. ఇద్దరికి కలిపి రూ.1500 అయ్యాయి. సర్కార్ దవాఖాన అని వస్తే మా జేబులో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లలేకనే ఇక్కడికి వచ్చాం. మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
– అనిల్, అశ్వారావుపేట
పరిశుభ్రత లేదు
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత లేదు. డాక్టర్లు కూడా సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడో 11గంటల తర్వాత వస్తారు. పెద్దాసుపత్రి కదా అని ఏదో ఊహించుకున్నాం. చిన్నపిల్లల మందులు కూడా అందుబాటులో లేవు. బయటి నుంచే తెచ్చుకోవాల్సి వస్తోంది. పీఐసీయూ అనేది పేరుకు మాత్రమే.. దానికి తగ్గట్టు వైద్యం లేదు.
– దీపికారాణి, కొత్తగూడెం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

