Footballer : థాయ్‌లాండ్ (Thailand) లో ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) ఆడుతుండగా పిడుగుపడటంతో 24 ఏళ్ల సాఫ్వాన్ అవే (Safwan Awae) అనే యువ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం దక్షిణ థాయ్‌లాండ్ (South Thailand) లో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. గోలోక్ ఎఫ్ఏ కప్ అనే స్థానిక టోర్నమెంట్లో భాగంగా సాఫ్వాన్ అవే ఆడుతున్న శామ్‌కోల్ట్స్ జట్టు, అబూ ఎక్స్ నాంగ్ సిరిన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్నది. వర్షం పడుతున్నా ఆట కొనసాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మైదానంలో పిడుగుపడింది. పిడుగుపాటుకు సాఫ్వాన్ నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర ఆటగాళ్లు, సిబ్బంది అతని వద్దకు పరుగెత్తారు. కానీ అప్పటికే అతను కదలిక లేకుండా పడి ఉన్నాడు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంత్ మాట్లాడుతూ.. ‘ఘటనా స్థలంలో అత్యవసర వైద్య బృందాలు అతడిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాయి. కానీ తీవ్రమైన గాయాల కారణంగా సాఫ్వాన్ ప్రాణాలు నిలవలేదు’ అన్నారు. మలేషియాకు చెందిన ‘బెర్నామా’ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కూడా సాఫ్వాన్ మృతిపట్ల తీవ్ర సంతాపం ప్రకటించింది. ‘ఈ విషాద సమయంలో అతని కుటుంబానికి, క్లబ్‌కు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని తన ప్రకటనలో పేర్కొన్నది.