సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:36:28

కరోనా కదలికపై కన్ను

కరోనా కదలికపై కన్ను

  • గాలిలో వైరస్‌ వ్యాప్తి నిర్ధారణకు ప్రయోగాలు
  •  సిద్ధమవుతున్న సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్‌ 
  • ఆగస్టు 15నాటికి ప్రయోగాలు పూర్తి
  •  సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా వెల్లడి 
  • డ్రైస్వాబ్‌ పరీక్షలకు ఐసీఎమ్మార్‌ సానుకూలం
  • అనుమతుల కోసం పీఎంవోకు ఫైల్‌ 

ప్రధాన ప్రతినిధి, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించటంతో ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలు సిద్ధమవుతున్నాయి. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌), హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), చంఢీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ సంస్థలు గాలిలో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు త్వరలోనే పరీక్షలు నిర్వహించనున్నాయి. ఇప్పటి వరకు మనిషిని మనిషి తాకడం వల్ల, నోటి ము క్కు తుంపరలు, వైరస్‌ సోకిన వ్యక్తి తాకిన వస్తువులు, సామగ్రిని ఇతరులు ముట్టుకోవటంవల్ల కరోనా వ్యాపిస్తుందని నిర్ధారణ అయింది. గాలి ద్వారా ఎంతవరకు వ్యాపిస్తుందనేది కచ్చితంగా తెలుసుకోవటానికి మరోవారంలో పరిశోధన ప్రారంభిస్తామని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణకు’ చెప్పారు. కొన్ని దవాఖానలు, ఇతర నిర్దేశిత ప్రాంతాల్లోని గాలిలో ఏరోసోల్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం  ఎయిర్‌ శాంపిల్‌ యంత్రాలను జర్మనీ, అమెరికాల నుంచి ఈ నెలాఖరు వస్తాయని వివరించారు. వచ్చేనెల మొదటి వారంలోగా మొదటి దశ ఏరోసోల్‌ పరీక్షలు పూర్తవుతాయని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. ఆగస్టు15నాటికి తుది పరీక్షలు పూర్తిచేసి గాలిలో వైరస్‌ వ్యాపిస్తున్నదా లేదా అనే విషయాన్ని తేలుస్తామని, ఇందుకోసం కొన్ని స్థానిక కంపెనీల సహకారం కూడా తీసుకుంటామన్నారు. హిందుస్థాన్‌ యూనీలీవర్‌ కంపెనీ వద్ద ఉన్న గాలి శుద్ధి యంత్రాలను ఉపయోగిస్తామని చెప్పారు

డ్రై స్వాబ్‌తో రోజూ 6లక్షల టెస్టులు 

కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత సులువుగా నిర్వహించటానికి సీసీఎంబీ రూపొందించిన ‘డ్రై స్వాబ్‌' అనే విధానం మంచి ఫలితాలిస్తున్నది. ఈ విధానాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) సీరియస్‌గా పరిశీలిస్తున్నది. ఐసీఎంఆర్‌ ప్రాథమిక పరిశీలనలో సానుకూల ఫలితాలు వచ్చినట్టు సమాచారం. దీని ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్టు తెలుస్తున్నది. తక్కువ సమయంలో కొవిడ్‌ నిర్ధారణ కోసం సీసీఎంబీ డ్రై స్వాబ్‌ విధానాన్ని కనిపెట్టిన విషయం తెలిసిందే. కొత్త విధానంలో శాంపిల్‌  సేకరించిన వెంటనే నేరుగా ఆర్టీ-క్యూపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) యంత్రాల ద్వారా పరీక్ష జరిపి కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడించవచ్చు. వైరల్‌ ట్రాన్స్‌ఫర్‌ మీడియా, ఆర్నే అవసరం లేకుండా డ్రై స్వాబ్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చని సీసీఎంబీ వెల్లడించింది. ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదట అమలు చేయాలని రాకేశ్‌మిశ్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఆర్టీ-క్యూపీసీఆర్‌ టెస్టుల్లో లిక్విడ్‌ స్వాబ్‌ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అయితే, లిక్విడ్‌కు బదులుగా డ్రై స్వాబ్స్‌తో కరోనా పరీక్షలు నిర్వహిస్తే రోజుకు కనీసం ఆరు లక్షల పరీక్షలను జరుపవచ్చని సీఎస్‌ఎమ్మార్‌, సీసీఎంబీ చెప్తున్నాయి. కేవలం రూ.350తో జరిగే ఈ పరీక్షల ద్వారా రోజుకు కనీసం రూ.75 కోట్లు ఆదా చేయవచ్చని వివరించాయి. డ్రై స్వాబ్స్‌ టెస్టుల్లో భాగంగా రోగుల ముక్కు, నోటి నుంచి సేకరించిన నమూనాలను ద్రవ పదార్థంలో కాకుండా పరీక్షా నాళికల్లో నిల్వ చేస్తారు.logo