Vidya Balan | ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేనివాళ్లకు ఎంత మర్యాద ఇస్తారో, ఎంత చులకనగా చూస్తారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి.’ అంటూ ఓ ఇంటర్వ్యూలో గత స్పృతులను గుర్తుచేసుకున్నది అందాలభామ విద్యాబాలన్. ‘అది 2008. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక జరుగుతున్నది. అప్పట్లో నేను పెద్దగా మాట్లాడలేకపోయేదాన్ని. పెద్దగా చొచ్చుకుపోయే తత్వం కూడా నాది కాదు. సైలెంట్‌గా వేడుక చూస్తున్నాను. ఉన్నట్టుండి అవార్డు తీసుకోమని నన్ను స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ‘హేయ్ బేబీ’ సినిమాలోని నా కాస్ట్యూమ్‌కి వచ్చిన అవార్డు అది. దాన్ని ‘నా-రియల్’ అవార్డు అంటారు.
అస్సలు ప్రజాదరణ పొందని వారికి ఇచ్చే అవార్డు అది. అందరూ నవ్వుతూ నన్నే చూస్తున్నారు. ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌ని నేను కాదని, అవి ఆయన డిజైన్ చేసిన కాస్ట్యూమ్సనీ.. వాటితో నాకేంటి సంబంధం అని నేను చెబుతున్నా వినలేదు. చివరకు నా దర్శకుడు, కాస్ట్యూమ్ డిజైనర్లతో కలిసి ఈ అవార్డు తీసుకుంటాను.. అని అడిగినా ఒప్పుకోలేదు. బలవంతంగా స్టేజ్‌పై తీసుకెళ్లారు. షారుఖ్, సైఫ్ అలీఖాన్‌లు ఇద్దరూ కలిసి ఆ అవార్డు నాకందించారు. నిజం చెబుతున్నాను. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. ఏడుస్తూనే ఉన్నాను. ఇలా బహిరంగంగా నన్ను అవమానించే సాహసం చేశారంటే కారణం, పరిశ్రమలో నా వెనుక ఎవ్వరూ లేకపోవడమే.’ అంటూ ఆవేదన వ్యక్తపరిచారు విద్యాబాలన్.