Stomach Cancer | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో జీర్ణాశయ క్యాన్సర్ కూడా ఒకటి. కొత్తగా క్యాన్సర్ బారిన పడే వారిలో దాదాపు 1.5 శాతం మందిలో జీర్ణాశయ క్యాన్సర్ ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఏటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యంత సాధారణ క్యాన్సర్ లలో జీర్ణాశయ క్యాన్సర్ 5వ స్థానంలో ఉందని మహిళల్లో కంటే ఇది పురుషుల్లోనే ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణాశయ క్యాన్సర్ కారణాలను, లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణాశయ క్యాన్సర్ జీర్ణాశయ లైనింగ్ నుండి మొదలవుతుంది. గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వాటిని జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. అలాగే ఈ క్యాన్సర్ ప్రారంభదశలో ఉన్నప్పుడు మింగడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితిని డిస్ఫాగియా అంటారు. అలసటగా ఉండడం, అనారోగ్యంగా అనిపించడంతో పాటు ఎల్లప్పుడూ వికారంగా ఉంటుంది. కొన్నిసార్లు రక్తపు వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అజీర్ణం సమస్య ఎక్కువగా ఉండడం, కడుపు ఉబ్బరం ఎక్కువవ్వడం, కొద్దిగా ఆహారాన్ని తీసుకున్నా కూడా కడుపు నిండిన భావన కలగడం వంటివి కూడా జీర్ణాశయ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు.
అలాగే జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభ దశలో ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి వాటిని కూడా చూడవచ్చు. అదే విధంగా పొట్ట పైభాగంలో నొప్పి రావడం కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి. శక్తిని కోల్పోయినట్టుగా ఉండడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు రక్తహీనతను సూచిస్తాయి. కొన్నిసార్లు ఇవి వైరల్ ఇన్పెక్షన్ ను లేదా అల్సర్ ను కూడా సూచిస్తాయి. కానీ ఈ లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే జీర్ణాశయ క్యాన్సర్ ఏ వయసులో వారికైనా రావచ్చు. 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియాతో వచ్చే ఇన్పెక్షన్ దీర్ఘకాలం పాటు ఉంటే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో సహా సంబంధం లేని జీర్ణాశయ పరిస్థితులు జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభానికి దోహదం చేస్తాయి. జీర్ణాశయంలోని పొర దెబ్బతిన్న తరువాత వాపుకు గురైనప్పుడు గ్యాస్ట్రిటిస్ వస్తుంది. ఈ సమస్యను అదుపు చేయకుండా వదిలేయడం ద్వారా ఈ పరిస్థితి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. అదే విధంగా జన్యుపరంగా కూడా జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా జీర్ణాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలనీ ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి వ్యాధి నిర్దారణ చేసుకుని తగిన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.