Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25 : ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ‘ఉస్మానియా తక్ష్ – 2024’లో భాగంగా వర్సిటీలోని అన్ని కళాశాలలు, విభాగాలలో ఓపెన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విభాగాలలో ప్రత్యేకంగా కొన్ని అంశాలలో పోటీలు నిర్వహించారు. మరికొన్ని విభాగాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆయా విభాగాలన్నింటినీ తిరిగి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకలకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వర్సిటీ ప్రారంభించిన రోజును పురస్కరించుకుని వ్యవస్థాపక దినోత్సవాన్ని గత 104 ఏళ్లలో ఎప్పుడూ నిర్వహించలేదని గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం నుంచి ప్రతీ ఏడాది వర్సిటీని ప్రారంభించిన ఏప్రిల్ 26వ తేదీన ఘనంగా ఓయూ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.