e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home సిద్దిపేట దండిగ ధాన్యం..చెంతనే కాంటా!

దండిగ ధాన్యం..చెంతనే కాంటా!

దండిగ ధాన్యం..చెంతనే కాంటా!
  • మెతుకు సీమలో గణనీయంగా వరిసాగు
  • రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
  • గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు
  • మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ
  • ఉమ్మడి జిల్లాలో 877 కొనుగోలు కేంద్రాలు
  • 3,28,842 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • వెంట వెంటనే మిల్లులకు తరలింపు
  • దిశానిర్దేశం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, మే17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ కృషితో జిల్లాలను గోదావరి జలాలు ముద్దాడమే కాకుండా విస్తారంగా వర్షాలు కురవడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చెరువులు, చెక్‌డ్యామ్‌లు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో పడావు భూములు సైతం సాగులోకి రావడంతో ఈ యాసంగి లో గణనీయంగా వరి సాగైంది.రైతులు పండుగలా వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఎక్కడో ఉన్న గోదావరి జలాలను తీసుకువచ్చి మండుటెండల్లో సైతం మత్తళ్లు దుంకించారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఉమ్మ డి మెదక్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగైంది. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి రైతు ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నాయి.

గతంలో ఐదు పుట్లు పండించిన రైతు.. ఇవాళ ఏకంగా పది పుట్లు పండించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 40శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. మరో 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా కానున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ యాసంగిలో 5,68,616 ఎకరాల్లో వరి సాగుచేశారు. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 877 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 68,627 మంది రైతుల నుంచి 3,28,842 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల నుంచి వెంట వెంటనే తరలించే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆర్థ్ధిక మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

3,28,842 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ..
సిద్దిపేట జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యం పంట పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుబాటులోకి రావడంతో రైతులు రికార్డు స్థాయిలో వరి సాగుచేశారు. రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పాటు తపాస్‌పల్లి రిజర్వాయర్‌, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, కూడవెల్లి, హల్దీవాగుల పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు వరిని సాగుచేశారు. సిద్దిపేట జిల్లాలో యాసంగిలో 2.83 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. మెదక్‌ జిల్లాలో హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యాంలను గోదావరి జలాలతో నింపారు. ఘనపురం ప్రాజెక్టు, సింగూరు జలాలతో ఈ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ యాసంగిలో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా, సింగూరుతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద వరి సాగైంది. ఈ జిల్లాలో 73,616 ఎకరాల్లో వరిని సాగు చేశారు. మొత్తంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో యాసంగిలో 5,68,616 ఎకరాల్లో వరి సాగైంది. ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 877 కొనుగోలు కేంద్రాల ద్వారా 68,627 మంది రైతుల నుంచి 3,28,842 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది.

సిద్దిపేట జిల్లాలో రూ.295.89 కోట్ల ధాన్యం ..
సిద్దిపేట జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో మహిళాసంఘాల ద్వారా 225, పీఏసీఎస్‌లు 169, ఏఎంసీ 9, మెప్మా ద్వారా 4 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో 1,56,722 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 30,187 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ. 295.89 కోట్లు ఉంటుంది. కొనుగోలు చేసిన ధాన్యంలో ఆయా ఆయా కేంద్రాల నుంచి 1,49,676 మెట్రిక్‌ టన్నులు మిల్లులకు తరలించారు. 16,075 మంది రైతులకు రూ. 158.72 కోట్లు వారి ఖాతాలో జమ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 35 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి ఆయా కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైస్‌ మిల్లులకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో రూ. 203.72 కోట్ల ధాన్యం…
మెదక్‌ జిల్లాలో ప్రభుత్వం 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పీఏసీఎస్‌ల ద్వారా 225, మహిళా సంఘాలు 98, మార్కెటింగ్‌ ద్వారా 3 కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లాలో 24,232 మంది రైతుల నుంచి 1,07,902 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దీని విలువ రూ. 203.72 కోట్లు ఉంటుంది. ఆయా కేంద్రాల నుంచి 1,01,733 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైస్‌మిల్లులకు తరలించారు. సోమవారం ఉదయం వరకు ధాన్యం కొనుగోలు చేసిన వారిలో 8,943 మంది రైతులకు రూ.87.29 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమచేశారు.

సంగారెడ్డి జిల్లాలో రూ129.89 కోట్ల ధాన్యం…
సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం వరకు రూ.129 కోట్ల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో 144 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 80, పీఏసీఎస్‌ 54, డీసీఎంఎస్‌ 8, ఏఎంసీ ద్వారా 2 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 14,208 మంది రైతుల నుంచి 68,799 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆయా కేంద్రాల నుంచి 64,218 మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైస్‌మిల్లులకు తరలించారు. 7020మంది రైతులకు రూ.65.04కోట్లు నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమచేశారు.

పదిపుట్ల వడ్లు ఎక్కువైనై..
ఈ యేడు యాసంగి పుష్కలంగా వడ్లు పండినై. నాకు పోయిన యాసంగితో లెక్క చేసుకుంటే.. ఈ యేడు పదిపుట్ల(వంద బస్తాలు) వడ్లు ఎక్కువైనై. మూడు ఎకరాల్లో వరి ఏస్తే దగ్గరదగ్గర 260 బస్తాలు (45కిలోల సంచులు) వడ్లు పండి తే సొసైటీ పెట్టిన కాంటాలో అమ్మిన. పోయినా యాసంగిలో 158 బస్తాలు పండినై.. ఇప్పుడు బాగా బరకతి(దిగుబడి) వచ్చింది. వడ్లకు కూడా ప్రభుత్వం మంచి ధర ఇచ్చింది. రూ. 2లచ్చలు వరకు పైసలు వస్తయ్‌. లాక్‌డౌన్‌ అయి పోయినంక పెద్ద బిడ్డ పెండ్లి చేద్దామనకుంటున్నం. పెండ్లికి పైసలు అక్కెరకు వచ్చినట్టే. సర్కారు పెట్టుబడి కింద ఎకరానికి ఇచ్చే రూ. 5వేలు కూడా ఖాతా ల వస్తున్నయ్‌. ఏనుకట ఎవుసం చేస్తే ఏం మిగిలేదీ కాదు.. గిప్పుడు పండుగ మారింది. గిప్పుడు మళ్ల ఎకరం ఎరగాలు(మూడో పంట)నారు పోసిన. మూడు, నాలుగు రోజుల్లో నాటు వేస్తం. అన్ని విధాల అదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు మా లంబాడోళ్ల రైతులందరి తరపున రాంరాం.

  • నునావత్‌ సునీత, గిరిజన మహిళా రైతు, చౌడుతండా, అక్కన్నపేట

గతేడాది కంటే బాగా పెరిగింది
నాకు ఉన్న 12ఎకరాల్లో గతేడాది కంటే ఈ ఏడాది 120 క్వింటాళ్లు ఎక్కువ పండినయి. నిరుడు 230క్వింటాళ్ల పండితే, గిప్పుడు 350 క్వింటాళ్లు వచ్చినయి. ఎకరానికి సుమారు రూ. 24 వేల ఖర్చు వచ్చేది. ఇప్పుడా ఖర్చు రూ. 5వేల వరకు తగ్గింది. గతేడాది నీళ్లు లేక అంతగా పండలే. ప్రభుత్వం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపడంతోపాటు వర్షాలు సమృద్ధిగా పడడంతో భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో నీళ్లు మస్తుగా ఉన్నాయి. మునపటి కంటే పంట ఎక్కువ పండడంతో పంటను ప్రభుత్వం కొంటదో కొనదోనన్న రందీ ఉండే. అయితే, పండించిన ధాన్యానికి ప్రభుత్వం రూ.1888 మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వడ్లను కొంటున్నది. వడ్లు అమ్మిన 48 గంటల్లోనే పైసలు చేతికందినయి. అందరి రైతుల చేతుల్లో పైసలు గలగలలాడుతున్నాయి.

  • కవ్వం భాస్కర్‌రెడ్డి, రైతు, నర్సాయపల్లి, మండలం మద్దూరు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దండిగ ధాన్యం..చెంతనే కాంటా!

ట్రెండింగ్‌

Advertisement