బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 10, 2020 , 23:19:18

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలి

ప్లాన్‌ యువర్‌ విలేజ్‌.. ప్లాన్‌ యువర్‌ టౌన్‌.. ప్లాన్‌ యువర్‌ స్టేట్‌.. అని సీఎం కేసీఆర్‌ అంటుంటారని, ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం మున్సిపాలిటీలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి మున్సిపాలిటీలపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు 42అంశాలతో ప్రాతిపదిక నమూనా పట్టిక తయారు చేశామని, త్వరలో మున్సిపాలిటీల్లోని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శంగా ఉన్నదని, దీనిని నమూనాగా తీసుకొని, అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు ఉండాలని, దానిని ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నూటికి నూరు శాతం తడి చెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించాలని అధికారులకు సూచించారు. - సిద్దిపేట, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి టౌన్‌/మెదక్‌

మెదక్‌/ సిద్దిపేట, నమస్తే తెలంగాణ/సంగారెడ్డి టౌన్‌ : ‘సీఎం కేసీఆర్‌ ‘ప్లాన్‌ యువర్‌ విలేజ్‌.. ప్లాన్‌ యువర్‌ టౌన్‌.. ప్లాన్‌ యువర్‌ స్టేట్‌'.. అని చెబుతుంటారు.. సీఎం ఆలోచనకు అనుగుణంగా  మన టౌన్‌ అభివృద్ధికి ప్లాన్‌ చేసుకొని పని చేయాలి.. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులను మున్సిపాలిటీలకు ఠంచనుగా ఇస్తోంది.. మీరు చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేయండి.. మున్సిపాలిటీల్లో ఉద్యోగాల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం.. ఇందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. త్వరలో నియామకాలు జరుగుతాయి.. రాష్ట్రంలోని పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి.. సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీ.. దీన్ని నమూనాగా తీసుకొని ఇతర మున్సిపాలిటీల్లో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలి’.. అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమీక్ష జరిగింది. దీనికి ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్‌, భూపాల్‌రెడ్డి, కలెక్టర్లు వెంకట్రామ్‌రెడ్డి, ధర్మారెడ్డి, హన్మంతరావు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఇతర పురపాలక శాఖ అధికారులు హాజరయ్యారు.

  అభివృద్ధి పనుల్లో నిమగ్నం కావాలి..

ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, మూడున్నరేండ్లు ప్రశాంతంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనుల్లో నిమగ్నమవ్వాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42 అంశాలను ప్రాతిపదికన తీసుకొని, నమూనా పట్టిక తయారు చేశామన్నారు. అందులో ఆదర్శ మున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన అభివృద్ధి, అవసరమైన పనులు, హంగులు ఉన్నాయన్నారు. వీటిని మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు అందజేస్తామన్నారు. 42అంశాల్లో మీ మున్సిపాలిటీల్లో ఏమి ఉన్నాయి? ఏమి లేవు? అన్నవి చెక్‌ చేసుకోవాలన్నారు. మరో మూడున్నరేండ్లలో అభివృద్ధి పట్టికలో ఏ స్థానంలో తీసుకెళ్లాలి.. ఏ పనులు ప్రాధాన్య క్రమంలో చేపట్టాలి.. అనే ప్రణాళికను లక్ష్యంగా నిర్ణయించుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డు ఉందా? ఆన్‌లైన్‌లో బిల్డింగ్‌ పర్మిషన్లు ఇస్తున్నామా? ప్రజలకు తాగునీరు ఎలా అందుతున్నది? అనే అంశాలు 42అంశాల జాబితాలో ఉంటాయన్నారు. మెదక్‌, సంగారెడ్డి మున్సిపాలిటీలు జిల్లా కేంద్రాలు కూడా.. ఇవి అన్ని రంగాల్లో సమగ్ర రీతిలో అభివృద్ధి చెందాలన్నారు. రిసోర్సెస్‌, పవర్‌, శానిటైజ్‌, వాటర్‌ ఆడిట్లను అన్ని మున్సిపాలిటీలు నిర్వహించాలన్నారు. రిసోర్సెస్‌ ఆడిట్‌లో భాగంగా మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆదాయ వనరులను పెంచేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు.

  ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి

మున్సిపాలిటీలు ప్రతి నెలా క్రమం తప్పకుండా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని, విద్యుత్‌ పొదుపును పాటించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అవసరమైన చోట ఎల్‌ఈడీ లైట్లు పెట్టించడం.. పని చేయని బోర్ల కనెక్షన్‌ తీయడం.. కెపాసిటర్లు వినియోగించడం ద్వారా విద్యుత్‌ బిల్లులు తగ్గుతాయన్నారు. పవర్‌ ఆడిట్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఎన్ని సిమెంట్‌ పోల్స్‌ ఎన్ని? ఇనుప పోల్స్‌ ఎన్ని? కొత్తగా విలీనమైన ఎన్ని గ్రామాలను కవర్‌ చేస్తున్నాం? అనే అంశాలను సమీక్షించాలన్నారు. శానిటైజేషన్‌ ఆడిల్‌ భాగంగా తడి, పొడి చెత్త సేకరణ చేస్తున్నారా? డంపింగ్‌ యార్డుల నిర్మాణం, నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసేలా ప్రజలను చైతన్యపర్చాలని, శానిటరీ సిబ్బంది పేర్లను వార్డులో ప్రదర్శించడం, వారి ఫోన్‌ నంబర్లు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచడం, చెత్త సేకరిస్తున్నారా? అని వార్డుల్లో ఇండ్ల వద్ద రిజిస్టర్లు పెట్టి నిఘా పెట్టాలన్నారు. శానిటరీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సిబ్బందికి విధిగా జీతం ఎంత ఇస్తున్నారన్నది కమిషనర్లు పరిశీలించాలన్నారు. వారికి దుస్తులు, బూట్లు, మాస్క్‌లు ప్రభుత్వం తరపున అందించాలని సూచించారు. 

  అన్ని మున్సిపాలిటీల్లో షీ టాయిలెట్లు..

అన్ని మున్సిపాలిటీల్లో షీటాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఆగస్టు 15లోగా ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ ఉండే లక్ష్యంతో పని చేయాలన్నారు. 50శాతం షీ టాయిలెట్లు ఉండాలని చెప్పారు. 400 పాత బస్సులను తీసుకొని, మహిళల కోసం పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలన్నారు. బయోలాజికల్‌, బయోమెడికల్‌ వేస్టేజ్‌, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమాలీష్‌ వేస్టేజ్‌ నిర్వహణ చేపటాలన్నారు. ఇందుకోసం ఆయా రంగాల వారితో సమావేశం పెట్టి, వాటి నిర్వహణ చేపట్టాలన్నారు. కనస్ట్రక్షన్‌ అండ్‌ డెమాలీష్‌ వేస్టేజ్‌తో టైల్స్‌ తయారు చేయవచ్చని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టును ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు యానిమల్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్వహణలో సిద్దిపేట ఆదర్శంగా ఉందన్నారు. అక్కడకు వెళ్లి ప్రజాప్రతినిధులు , మున్సిపల్‌ అధికారులు పరిశీలించాలన్నారు. 

  రూపాయికే నల్లా కనెక్షన్‌..

తెల్లరేషన్‌ కార్డుదారులకు అన్ని మున్సిపాలిటీల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇవాలని, మిగతా వారికి రూ.100కు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రమంతా ఇదే విధానం కొనసాగాలన్నారు. వాటర్‌ ఆడిట్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నాం? ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా? అని అంచనాలు తయారు చేయాలని సూచించారు. సింగపూర్‌ లాంటి దేశాల్లో 100 లీటర్ల నీటికి 90 లీటర్ల బిల్లులు వస్తాయని, 10శాతం నీరు ట్రాన్స్‌మిట్‌ లాస్‌ అవుతుందన్నారు. మన దగ్గర 100 లీటర్ల నీటికి 60 లీటర్లకు కూడా బిలుల్లు రావడం లేదని, ఈ పరిస్థితి మారాలన్నారు. ప్రజలకు మంచి నీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికాబద్ధంగా ఇస్తే బిల్లులు చెల్లించడానికి వెనుకాడరన్నారు.

 తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలి : మంత్రి హరీశ్‌రావు 

నూటికి నూరు శాతం తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, ప్రతి మున్సిపాలిటీలో డంప్‌ యార్డు ఉండాలని, దానిని ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రిసోర్స్‌, పవర్‌, శానిటైజర్‌, వాటర్‌ ఆడిట్‌ నిర్వహించి, గుణాత్మక మార్పునకు నాంది పలుకుదామని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ ఆగస్టు 15 కల్లా ఉండేలా పనిచేస్తామన్నారు. డెబ్రిస్‌ మేనేజ్‌ ప్రాజెక్టు, యానిమల్‌ కేర్‌ సెంటర్లు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నారు. మూడు జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున మొబైల్‌ బస్‌ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆదాయ వనరులు పెంచుకొని మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వాటర్‌ టాక్స్‌ వందకు వంద శాతం వసూలయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. సంగారెడ్డి, సదాశివపేట, వంటి మున్సిపాలిటీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల దాహం తీరుస్తామన్నారు. పట్టణాల అభివృద్ధి, వాటిల్లో వచ్చే మార్పు నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. గ్రామాల నుంచి వచ్చే ప్రజలు పట్టణాలపై ఆధారపడుతారన్నారు. ఈ కారణంతో పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


logo