బర్డ్ ఫ్లూ గ్రిప్‌లో ఇండియా: పౌల్ట్రీ రంగానికి భారీ నష్టం!

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. పులిమీద పుట్రలా.. బర్డ్ ఫ్లూ వచ్చి పడింది. దేశీయంగా పలు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఉత్తరాదిలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కొన్ని రోజుల్లోనే హోల్‌సేల్ మార్కెట్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. శనివారం పంజాబ్, హర్యానాల్లోని పౌల్ట్రీ ఫామ్‌ల్లో భారీగా కోళ్లు చంపేయడం, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడం ఆందోళన మరింత పెంచివేసింది. ఇంతకుముందు కూడా పంజాబ్, హర్యానాలతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో కోళ్ల మరణాలు జరిగాయి.
50 శాతం తగ్గిన చికెన్ ధరలు
దీని ప్రభావం చికెన్ ధరలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపింది. బర్డ్ ప్లూ వల్ల చికన్ సేల్స్ 70 శాతానికి పైగా పతనం అయ్యాయని తెలుస్తోంది. చికెన్ ధర 50 శాతం పడిపోతే, కోడిగుడ్ల ధరలు 15 నుంచి 20 శాతం పతనం అయ్యాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రమేశ్ ఖత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్ల మరణం
శనివారం పుణెలోని హోల్‌సేల్ మార్కెట్లో చికెన్ ధర కిలోకు రూ.82.48 నుంచి రూ.58.23లకు పడిపోయింది. 100 గుడ్ల ధరలు శనివారం రూ.550 పలికితే, శనివారం రూ.490కి పతనం అయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ చికెన్, కోడిగుడ్ల ధరలు పతనం అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కోళ్లు చనిపోయాయి.
కోళ్ల అంతర్ రాష్ట్ర రవాణాపై నిషేధం
ఇంతకుముందు కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. బర్డ్ ఫ్లూ వల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కోళ్ల రవాణాపైనా నిషేధం విధిస్తున్నారు. చికెన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు కోళ్ల రవాణా నిలిచిపోయిందని రమేశ్ ఖత్రి వెల్లడించారు. వదంతుల నుంచి పౌల్ట్రీ రంగాన్ని కాపాడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మొక్క, చిరు ధాన్యాల ధరలూ పతనం
అంతేకాదు... కోళ్లకు వాడే దాణాలో వినియోగించే మొక్కజొన్న క్వింటాల్ ధర 2018-19లో రూ.2600, చిరు ధాన్యాల ధర రూ.1900 పలికితే, ఇప్పుడు కేవలం రూ.1,350లకే రైతులు అమ్ముకోవాల్సి వస్తున్నది. తాజా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఆదివారం సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారని తెలుస్తోంది.
2006 నుంచి ప్రతి శీతాకాలంలోనూ ఎవియాన్ ఇన్‌ఫ్లూయెంజా
2006 నుంచి ప్రతియేటా శీతాకాలంలో ఎవియాన్ ఇన్‌ఫ్లూయెంజా అనే కామన్ కోల్డ్ డిసీజ్ కోళ్లకు రావడం సాధారనంగా మారింది. అయితే చికెన్ తిన్నా, మానవుల్లోకి బర్డ్ ఫ్లూ ట్రాన్స్‌మీట్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదని నిపుణులు చెబుతున్నారు.
భారత పౌల్ట్రీ పరిశ్రమ విలువ సుమారు రూ.1.25 లక్షల కోట్లు అని, కరోనా వల్ల దాని విలువ రూ.60/70 వేల కోట్లకు పడిపోయిందని అగ్రికల్చరల్ ఎకనమిస్ట్, పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అడ్వైజర్ విజయ్ సర్దానా తెలిపారు. 2020 చివరి రోజుల్లో మాత్రమే పౌల్ట్రీ పరిశ్రమ కోలుకుంటున్నదని, కానీ బర్డ్ ఫ్లూ సోకడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.