శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Jan 23, 2020 , 03:07:02

వెల్లివిరిసిన మహిళా చైతన్యం

వెల్లివిరిసిన మహిళా చైతన్యం


నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో మరోసారి మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లలోనే కాకుండా పోలింగ్ వారే ముందున్నారు.జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ జరిగింది. మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 80వార్డులుండగా.. ఐదు వార్డులు ఏకగ్రీవం కావడంతో 75వార్డులకు పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,37,988 మంది ఓటర్లగాను.. 91,598మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో సగటున 66. 38 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్ 76.12శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా భైంసా లో 64.70శాతం పోలింగ్ నమోదైంది. నిర్మల్ 65.31 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో నిర్మల్ మున్సిపాలిటీలో 68.42శాతం, భైంసా మున్సిపాలిటీలో 63.54శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో గతంలో సగటున 65.98 శాతం నమోదు కాగా.. ఈ సారి స్వల్పంగా పెరిగింది. ఈసారి 66.38శాతం సగటు పోలింగ్ శాతం ఉండగా.. గతంలో కంటే 0.40శాతం పోలింగ్ పెరిగింది.

మున్సిపాలిటీల వారీగా చూస్తే.. గతంలో కంటే ఈ సారి నిర్మల్ పోలింగ్ శాతం 3.11శాతం తగ్గింది. భైంసాలో గతంలో కంటే ఈ సారి 1.16శాతం పోలింగ్ పెరిగింది. జిల్లా కేంద్రమైన నిర్మల్ పోలింగ్ తగ్గగా.. భైంసాలో మాత్రం స్వల్పంగా పెరగడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో కనీసం 80శాతం పోలింగ్ నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికి ఆశించిన మేర ఫలితాలు రాలేదు. సాధారణంగా గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్ ఎన్నికల్లో జిల్లాలో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. ఈ నాలుగు ఎన్నికల్లోనూ 75శాతానికి పైగా నమోదవగా.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 66.38శాతానికే పరిమితమైంది. పట్టణ ఓటర్లు పోలింగ్ పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అధికారులు పోలింగ్ పెంచేందుకు అవగాహనతో పాటు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పట్టణ ఓటర్లు మూడింట రెండొంతుల మంది మాత్రమే పోలింగ్ పాల్గొన్నారు.

-జిల్లాలో మరోసారి మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లలోనే కాకుండా పోలింగ్ వారే ముందున్నారు. జిల్లాలో మొత్తం 1,37,988మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 67,423మంది పురుషులు, 70553మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు 3,130మంది అధికంగా ఉన్నారు. మూడు మున్సిపాలిటీల్లోనూ  పురుషుల కన్నా  మహిళలు ఎక్కువ ఓటర్లు ఉండగా.. పోలింగ్ మాత్రం రెండు చోట్ల వారిదే ఆధిపత్యం కొనసాగింది. నిర్మల్, ఖానాపూర్ పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మంది పోలింగ్ పాల్గొనగా.. భైంసాలో మాత్రం పురుషుల కంటే మహిళలు తక్కువగా పోలింగ్ పాల్గొన్నారు. ఓటర్ల పరంగా చూస్తే.. నిర్మల్ పురుషుల కంటే మహిళలు 2615మంది ఎక్కువగా ఉండగా.. భైంసాలో 79మంది, ఖానాపూర్ 436మంది మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

పోలింగ్ విషయానికొస్తే జిల్లాలో 91,598మంది పోలింగ్ పాల్గొనగా.. సగటు పోలింగ్ 66.38శాతం నమోదైంది. ఇందులో 66.82 శాతం మహిళలు పోలింగ్ పాల్గొనగా.. .పురుషులు 65.93శాతం పోలింగ్ పాల్గొన్నారు. సగటు పోలింగ్ శాతానికన్నా 0.44శాతం అధికంగా మహిళలు పోలింగ్ పాల్గొనగా.. పురుషులకన్నా 0.89శాతం అధికంగా మహిళలు పోలింగ్ పాల్గొన్నారు. పురుషుల కంటే మహిళలు.. నిర్మల్ 1694మంది, ఖానాపూర్ 1104మంది అధికంగా పోలింగ్ పాల్గొన్నారు. భైంసాలో మాత్రం పురుషుల కన్నా 285 మంది మహిళలు తక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కన్నా మహిళలు.. నిర్మల్ 0.39శాతం, ఖానాపూర్ 9.82శాతం అధికంగా పాల్గొన్నారు. భైంసాలో పురుషుల కన్నా మహిళలు 1.82శాతం మంది తక్కువగా ఓటింగ్ పాల్గొన్నారు.


logo