బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 23, 2020 , 03:16:06

టెన్షన్.. టెన్షన్..

టెన్షన్.. టెన్షన్..


నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  మన వార్డులో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి? మున్సిపాలిటీ చైర్మన పీఠం ఏ పార్టీకి దక్కుతుంది? పురపాలక సంఘాలకు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే జిల్లా అంతటా వినిపిస్తున్న సాధారణ ప్రశ్నలు ఇవి. ఎన్నికలు జరుగుతున్న నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూర్ పట్టణాలతోపాటు జిల్లా అంతటా పురపోరు పై ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారు? ఎంత మెజారిటీ సాధించే అవకాశం ఉంది? ఇలాంటి అంచనాలు ఓటర్లలో నెలకొన్నాయి. తమదైన శైలిలో ప్రతి ఒక్కరూ తమ తమ విశ్లేషణలు తోటి వారికి వినిపిస్తున్నారు.

అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ 

సాధారణ ప్రజానీకంలోనే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల పై తీవ్ర ఆసక్తి నెలకొనగా.. ఇక అభ్యర్థుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీల పరిధిలో 162 వార్డులు ఉండగా.. ఇప్పటికే ఏకగ్రీవమైన చిట్యాల 3వ వార్డు మినహా.. 161 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీల అభ్యర్థుల్లో ఒకరు.. మున్సిపల్ చైర్మన్ పీఠాల పై కూర్చోనున్నారు.

ఈ నేపథ్యంలో వార్డు స్థానాలకు పోటీ పడ్డ కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. పోలింగ్ ముగిసిన మరు నిమిషం నుంచే తమ తమ గెలుపు అవకాశాల పై అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. తమకు తెలిసిన రాజకీయ పండితులు.. తమ తమ వార్డుల పరిధిలోని ముఖ్యులతో తమకు పోలైన ఓట్ల గురించి ఆరా తీస్తున్నారు. కుటుంబాలు, కాలనీలు, అపార్ట్ మైనార్టీలు, నాన్ మైనార్టీలు, సామాజిక వర్గాల వారీగా తమకు పడ్డ ఓట్ల గురించి.. తమ ప్రత్యర్థులకు పోలైన ఓట్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం వెల్లడించే వరకు ఈ టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది.logo