ఈ నష్టాలు తెలిస్తే కూల్ డ్రింక్స్‌ను ఇకపై తాగరు..!


Mon,May 7, 2018 04:13 PM

ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. బయట కాలుపెట్టాలంటేనే భయమేస్తున్నది. వడదెబ్బ సోకుతుందని జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మండే ఎండలకు జనాలు ఇండ్లను వదిలి బయటకు రావడం లేదు. ఇక గత్యంతరం లేక బయటకు వచ్చేవారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు వివిధ రకాల శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే అంత వరకు బాగానే ఉన్నప్పటికీ శీతల పానీయాల్లో సహజ సిద్ధమైన వాటిని కాకుండా చాలా మంది కూల్‌డ్రింక్స్‌ను విపరీతంగా తాగుతున్నారు. వేసవిలో చల్ల చల్లని కూల్ డ్రింక్స్ దాహం తీరుస్తాయని, శక్తినిస్తాయని చెప్పి ఎడా పెడా వాటిని తాగుతున్నారు. కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కూల్‌డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది. కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కూల్ డ్రింక్స్‌ను మితి మీరి తాగరాదు.

2. కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

3. కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్‌డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు. ఒక్కోసారి మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

4. కూల్ డ్రింక్స్‌లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలకు చేటు చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దంత క్షయం ఏర్పడుతుంది. దీంతో దంతాలు సెన్సిటివ్‌గా మారి చల్లని, వేడి పదార్థాలు తింటే తట్టుకోలేకపోతారు.

5. చాలా మంది మద్యం సేవించే వారు కూల్ డ్రింక్స్‌ను ఆల్కహాల్‌లో కలుపుకుని సేవిస్తారు. అలా చేస్తే లివర్, కిడ్నీలపై అధికంగా భారం పడుతుంది. దీంతో అవి కాలక్రమేణా పనిచేయకుండా పోతాయి.

కనుక కూల్ డ్రింక్స్‌ను తాగేవారు ఈ జాగ్రత్తలను తెలుసుకుంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. కూల్ డ్రింక్స్‌ను కాకుండా కొబ్బ‌రి నీళ్లు, స‌హ‌జ‌సిద్ధంగా ఇంట్లో త‌యారు చేసుకునే శీత‌ల పానీయాలు, నిమ్మ ష‌ర్బ‌త్‌, పండ్ల ర‌సాలు తాగితే వేసవి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

6884

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles