మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:06

అడ్డుకున్నది ప్రతిపక్షాలే

అడ్డుకున్నది ప్రతిపక్షాలే

  • బురద రాజకీయాలు మానుకుంటే మంచిది
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముందుచూపుతో ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని 2015లోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదిస్తే.. దాన్ని ప్రతిపక్షాలే అడ్డుకున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. చేసేదంతా చేసి ఇప్పుడు హాస్పిటల్‌లోకి నీళ్లు వస్తున్నాయని అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. ఉస్మానియా దవాఖాన దుస్థితికి ప్రతిపక్షాల నిర్వాకమే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్‌అలీ ముర్తుజా రిజ్వితో ఈటల సమీక్షించారు. 

దవాఖాన స్థానంలో తెలంగాణ గర్వించదగ్గ కొత్త హాస్పిటల్‌ సముదాయాలను నిర్మించాలని ప్రయత్నిస్తే ఆ చర్యలను అసెంబ్లీ సాక్షిగా బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి వ్యతిరేకించాయని ఈటల మండిపడ్డారు. అనేక సంఘాలు కూడా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. వీరి ఒత్తిడితోనే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టి, అప్పట్లోనే పెద్దఎత్తున మరమ్మతులు చేయించిందని చెప్పారు. ఇప్పుడు వర్షాల కారణంగా ఉస్మానియా దవాఖానలో కొన్ని పెచ్చులు ఊడటం, వరదనీరు లోపలికి రావటం వల్ల రోగులకు కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేతలు బురద రాజకీయాలు మానుకోవాలని, దవాఖాన సిబ్బంది మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించొద్దని హితవుపలికారు.

వార్డుల్లోకి నీళ్లపై మంత్రికి నివేదిక 

ఉస్మానియా దవాఖానలో తీసుకున్న చర్యల గురించి అధికారులు.. మంత్రి ఈటలకు వివరించారు. వార్డుల్లోకి నీళ్లు వచ్చిన వెంటనే దవాఖానను సందర్శించి తక్షణ సహాయ చర్యలు చేపట్టినట్టు చెప్పారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఐఎండీసీ చీఫ్‌ ఇంజినీర్‌ లక్ష్మారెడ్డి దవాఖానను సందర్శించి రూపొందించిన నివేదికను ఈటలకు అందజేశారు. బేగంబజార్‌ నుంచి మూసీకి వెళ్లే వరదనీటి నాలా ఉస్మానియా హాస్పిటల్‌ భూగర్భం నుంచి వెళ్తున్నదని, అది బ్లాక్‌ కావడం వల్లే దవాఖానలోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. మరోవైపు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులైన సయ్యద్‌అలీ ముర్తుజా రిజ్వి గురువారం బీఆర్కే భవన్‌లో ఈటలతో తొలిసారి భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్‌ నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. 


logo